త్రిగుణ్ -మేఘ చౌదరి జంటగా మల్లి ఏలూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “జిగేల్” (Jigel). పోసాని, షాయాజీ షిండే, రఘుబాబు, పృథ్వీరాజ్ వంటి సీనియర్ ప్యాడింగ్ ఆర్టిస్టులందరూ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చ్ 7వ తారీఖున థియేటర్లలో విడుదలైంది. మరి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: ఇది స్లాప్ స్టిక్ కామెడీ చిత్రం. అందువల్ల ఇది ప్రత్యేకించి కథ, కథనం అంటూ ఏమీ ఉండదు. రకరకాల పాత్రల తీరుతెన్నులు బట్టి కథనం ముందుకెళుతూ ఉంటుంది. ఎలాంటి లాకర్ అయినా ఓపెన్ చేయగల నందు (త్రిగుణ్) చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తూ టైమ్ పాస్ చేస్తుంటాడు. అదే తరహాలో కాస్త పెద్ద మోసాలు చేస్తూ ఖిలాడీ లేడీ మీనా (మేఘ చౌదరి) నందు జీవితంలోకి సడన్ ఎంట్రీ ఇస్తుంది. ఈ ఇద్దరు కలిసి ఏం చేశారు? సెటిల్ అవ్వాలని వాళ్లు చేసిన ప్రయత్నానికి ఎలాంటి ఫలితం దక్కింది? అనేది “జిగేల్ (Jigel) కథాంశం”.
నటీనటుల పనితీరు: రెగ్యులర్ యూత్ ఫుల్ హీరో రోల్లో త్రిగుణ్ ఒదిగిపోయాడు. చాన్నాళ్ల తర్వాత అతడిలోని కామెడీ యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసి అలరించాడు. మేఘ చౌదరి అందంతోపాటు అభినయంతో ఆకట్టుకుంది. షాయాజీ షిండే, రఘుబాబు, పృథ్వీరాజ్ ల కామెడీ కాస్త అవుట్ డేటెడ్ అనిపించినా.. ఓ మేరకు ఎంటర్టైన్ చేస్తుంది. అయితే.. ఇంతమంది సీనియర్ కమెడియన్స్ ను ఒకే ఫ్రేమ్ లో చూడడం అనేది కాస్త రిలీఫ్ అనిపించింది.
సాంకేతికవర్గం పనితీరు: మంత్ర ఆనంద్ పాటలు, వాసు ఛాయాగ్రహణం సోసోగా ఉన్నప్పటికీ.. మల్లి ఏలూరి కథనాన్ని నడిపించిన విధానం సదరు విషయాలను పట్టించుకోనివ్వలేదు. సీనియర్ కమెడియన్స్ ను సరైన రీతిలో వినియోగించుకొని ఆడియన్స్ ను ఎంగేజ్ చేశాడు. ఈవీవీ స్టైల్లో కథ-కథనం కంటే క్యారెక్టర్ తో కామెడీ పండించి దర్శకుడిగా అలరించాడు మల్లి ఏలూరి.
ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వంటి టెక్నికాలిటీస్ గురించి పెద్దగా మాట్లాడుకునే స్కోప్ రాలేదు. సగటు విషయాల మీద ప్రేక్షకుల చూపు మరలకుండా చేశారు దర్శకుడు మల్లి.
విశ్లేషణ: పాత్రలతో కామెడీ పండిస్తూ, కథతో పెద్దగా పనిలేని సినిమాలు వచ్చి చాలా ఏళ్లయ్యింది. ఈ తరహా సిల్లీ ఎంటర్టైనర్స్ తో వెసులుబాటు ఏంటంటే.. మెదడుకి పని చెప్పకుండా, ఎలాంటి కంగారు లేకుండా సింపుల్ గా టైమ్ పాస్ కోసం “జిగేల్” (Jigel) లాంటి సినిమాలు హ్యాపీగా చూసేయొచ్చు.
ఫోకస్ పాయింట్: టైమ్ పాస్ ఎంటర్టైనర్!
రేటింగ్: 2.5/5