తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచడమే కాకుండా.. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి సొంతంగా పార్టీ పెట్టి ఎన్నో సంచలనాలు సృష్టించిన ఘనత స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికే చెల్లింది. ఇటీవల ఆయన 25వ వర్థంతి సందర్భంగా… ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్లో ‘తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ, నేటికీ, ముమ్మాటికీ, ధ్రువ తార మీరే’ అంటూ పోస్ట్ పెట్టాడు. తాత పై ఎన్టీఆర్ కు ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. చాలా సందర్భాల్లో దానిని వ్యక్తపరుస్తూనే వచ్చాడు. జూనియర్లో రామారావు గారి పోలికలు చాలా ఉంటాయి. అందుకే పెద్ద ఎన్టీఆర్ అభిమానులు అంతా జూనియర్ సినీ ఎంట్రీ ఇవ్వగానే అభిమానులుగా మారిపోయారు.
ఇక పెద్దాయన గురించి మన చిన్న రామయ్య(ఎన్టీఆర్) ఓ సందర్భంలో మాట్లాడుతూ.. “నాకు 11ఏళ్ళ వయసున్నప్పుడు…ఓ రోజు నాన్న నుండీ ఫోన్ వచ్చింది. మా అమ్మ నాకు వెంటనే కొత్త బట్టలు వేసి రెడీ చేస్తుంది.’మనం ఎక్కడికి వెళ్తున్నామని’ మా అమ్మని అడిగాను. ‘మీ తాతయ్య నిన్ను చూడాలనుకుంటున్నారట. మీ నాన్నగారు ఫోన్ చేశారు. కారు కూడా పంపించారు‘ అని చెప్పింది మా అమ్మ. అలా మేము తాతగారి దగ్గరకు వెళ్ళాము. అప్పుడు ఆయన కాషాయవస్త్రాల్లో ఉన్నారు. క్రింద చాలా గ్రంథాలు ఉన్నాయి. మమ్మల్ని చూసి ’రండి‘ అని పిలిచారు. నేను వెళ్లి ఆయన ముందు కూర్చున్నాను. ’మీ పేరేంటి‘ అని నన్ను అడిగారు. ’తారక రామ్‘ అని చెప్పాను. అలాగే తాత గారు నా పుట్టినరోజు గురించి, పుట్టిన టైం గురించి కూడా నాన్నను అడిగారు.
అటు తర్వాత కొద్ది సేపటికి ‘నాన్నా హరీ’.. అంటూ నాన్నను పిలిచారు. ’పేరు మార్చాలి. తారకరామ్ కాదు. నా పేరే పెడుతున్నా. ఇక పై నందమూరి తారకరామారావు అనే పిలవండి. పేరు మార్చండి‘ అని చెప్పారు. అప్పటి నుండీ దాదాపు ఏడాది పాటు తాతగారితోనే కలిసున్నాను. ‘విశ్వామిత్ర’ సినిమాలో ఆయనతో కలిసి తాను నటించాను. పురాణ పాత్రల్లో నటించేటప్పుడు తాతగారు మాంసాహారం ముట్టుకోరు. మిగిలిన రోజుల్లో అయితే అసలు నాన్ వెజ్ ను వదలరు. ఆ టైములో ఓ రోజు మా అమ్మ స్వయంగా వండి క్యారేజీని పంపింది. అమ్మ వండిన వంటలు తాతగారికి బాగా నచ్చాయి. వెంటనే అమ్మకు ఫోన్ చేసి పిలిపించారు. ’ఇన్నేళ్లుగా దూరంగా ఉన్నాం. వాటిని గురించి మీరేం పట్టించుకోవద్దు. నాకు వంశోద్ధారకుడిని ఇచ్చారు. నా అంతటి వాడు అవుతాడు. మీరే జాగ్రత్తగా చూసుకోండి. నా తరపున ఏం చేయాలో అన్నీ చేస్తా.‘ అని చెప్పారు. అప్పుడు అమ్మ కళ్లల్లో ఏదో తెలియని ఆనందం కనిపించింది. ఆయన ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వెళ్లిపోయాం. అయితే కొన్నాళ్లకి తాతగారు మరణించారు. ఆ వార్త విని మేము తట్టుకోలేకపోయాం.కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది” అంటూ చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!