ప్రముఖ నటి జ్యోతిక తాజాగా విద్యా వ్యవస్థల పై మండిపడింది. ‘మెడిసిన్ ఎంట్రన్స్ కోసం నిర్వహించే ‘నీట్ (ఎన్.ఇ.ఇ.టి)’ పరీక్ష కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్దులు తమ జీవితాలు కోల్పోతున్నారని ఆమె కామెంట్ చేసారు. దేశ వ్యాప్తంగా 35 శాతం మంది విద్యార్ధులు గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారని.. అందులో మాతృభాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్ధులు ‘నీట్’ లో ఏ విధంగా రాణిస్తారని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు జ్యోతిక ‘రాక్షసి’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపించనుంది జ్యోతిక. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో విద్యా వ్యవస్థ పై ప్రభుత్వం తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
జ్యోతిక మాట్లాడుతూ.. “గవర్నమెంట్ స్కూల్స్ లో ఉపాధ్యాయుల హాజరు చాలా తక్కువగా ఉంటుంది. ఇక ‘నీట్’ వంటి పరీక్షలకు విద్యార్ధులు ప్రత్యేకంగా శిక్షణ ఎలా తీసుకుంటారు. జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రతిష్టాత్మక పరీక్షలు నిర్వహించేప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, మాతృభాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్ధుల భవిషత్తును దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకొని నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వాలకు అర్ధం కాదా..? ఇప్పటికైనా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే లక్షలాది మంది జీవితాలు బాగుంటాయి” తన ఆవేదనని వ్యక్తం చేసింది జ్యోతిక. ఈమె మాట్లాడిన తీరుకి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.