‘పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ‘గబ్బర్ సింగ్’ను చూశావా అని అడగకూడదు. ఎన్నిసార్లు చూశావు అని అడగాలి’ అని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ.. అదేదో సినిమాలో సాయిధరమ్ తేజ్ అంటాడు. అలాగే తెలుగు సినిమా లవర్స్‌ను అడగాల్సిన ప్రశ్న ‘శంకరాభరణం’ చూశావా అని కాదు.. ఎన్నిసార్లు చూశావు అని’. ఇప్పటి జనాలకు తెలియదు కానీ… ఆ తరం సినిమా గోయర్స్‌కు ఈ సినిమా ఓ ఎమెషన్. సగటు కమర్షియల్ సినిమాలకు పూర్తి దూరంగా తెరకెక్కిన ఈ సినిమా..
వాటికి మించిన విజయం అందుకుంది. ఈ క్రమంలో ఓసారి సినిమా చూడటానికి వెళ్లి ప్రముఖ దర్శకుడు బాపుకు వింత అనుభవం ఎదురైందట. ఇందాక చెప్పినట్లు ‘శంకరాభరణం’ సినిమాను ఒకసారి చూసిన ప్రేక్షకులు ఆ రోజుల్లో ఉండరు అని చెప్పాలి. అలా ప్రముఖ దర్శకుడు బాపు కూడా చాలాసార్లు చూశారట. అలా తొమ్మిదోసారి ఆయన థియేటర్లో సినిమా చూడటానికి వెళ్లారట. ఇంటర్వెల్ టైమ్‌లో థియేటర్ నుండి ఆయన బయటకు వస్తే, ఇద్దరు స్కూలు అమ్మాయిలు బాపు దగ్గరకు వచ్చి ‘ఆటోగ్రాఫ్ ఇస్తారా’ అని అడిగారట.
‘నా దగ్గర పెన్ను లేదమ్మా’ అని బాపు అన్నారట. దానికి ఆ అమ్మాయిలు జామెట్రీ బాక్సులో పెన్సిల్ ఇచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారట.ఆ తర్వాత బాపుకు షాక్ ఇచ్చే విషయం జరిగిందట. ఆటోగ్రాఫ్ తీసుకుని అక్కడి నుండి వెళ్తూ.. ‘ఈ సినిమాకు డైరక్టర్ మీరే కదా’ అని అన్నారట. ‘కాదమ్మా’ అని బాపు అనగానే.. పక్కనున్న స్నేహితురాలితో ‘బాక్సులోని రబ్బరు ఇటు ఇవ్వు’ అని ఆటోగ్రాఫ్ తీసుకున్న అమ్మాయి అనిందట.
ఆ తర్వాత ఏం జరిగిందో మీరు ఊహించేయొచ్చు. ఈ విషయాల్ని ఓ సందర్భంలో బాపు చెప్పుకొచ్చారు. ఈ సినిమా గురించి, దాని ప్రభావం గురించి చెప్పాలంటే ఇలాంటి మాటలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇలాంటి సినిమా వచ్చిన రోజున అంటే ఫిబ్రవరి 2నే కె.విశ్వనాథ్ కన్నుమూయడం గమనార్హం.