Kaalamega Karigindi Review in Telugu: కాలమేగా కరిగింది సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • వినయ్ కుమార్ (Hero)
  • శ్రావణి మజ్జారి (Heroine)
  • అరవింద్ ముదిగొండ, నోమినా తార తదితరులు.. (Cast)
  • శింగర మోహన్ (Director)
  • మారె శివశంకర్ (Producer)
  • గుడప్పన్ (Music)
  • వినీత్ పబ్బాతి (Cinematography)
  • Release Date : మార్చ్ 21, 2025

ఈమధ్యకాలంలో మన తెలుగు సినిమాల్లో స్వచ్ఛమైన తెలుగు వినబడడం లేదు, కనబడడం లేదు. అప్పుడప్పుడు వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి లాంటి దర్శకులు తమ చిత్రాల్లో చూపించే, వినిపించే తెలుగుకే అమితానందపడితోతుంటారు భాషా ప్రేమికులు. అలాంటిది సినిమా మొత్తం స్వచ్ఛమైన భావుకత, ఈనాడు ఎడిటోరియల్ & సండే స్పెషల్ బుక్స్ లో మాత్రమే కనిపించే తెలుగు పదాలు సినిమా మొత్తం వినిపిస్తే ఎలా ఉంటుందో.. సరిగ్గా అలాంటి సినిమానే “కాలమేగా కరిగింగి”. శింగర మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చ్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ భావుకత ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: 2003లో టెన్త్ క్లాస్ పరీక్షల అనంతరం విడిపోయిన ఓ ప్రేమ జంట.. 17 ఏళ్ల తర్వాత కలుసుకున్నప్పుడు ఏం జరిగింది? ఇన్నాళ్ల విరహ వేదనను ఈ జంట ఎలా వేగింది? అనేది “కాలమేగా కరిగింది” కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమాలో అందరికంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ తో, మంచి నటనతో ఆకట్టుకున్న కుర్రాడు రవీంద్ ముదిగొండ. పోషించింది పరిణితి చెందని పాత్ర అయినప్పటికీ.. మంచి మెచ్యూరిటీ ప్రదర్శించాడు. మంచి భవిష్యత్ ఉంది అతడికి.

జూనియర్ హీరోయిన్ గా నోమినా తార ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కళ్లల్లో భావం ఇంకాస్త ప్రస్ఫుటంగా కనిపించి ఉంటే బాగుండేది. అమాయకత్వం పండించగలిగింది కానీ.. తొలిప్రేమ భావాన్ని సరైన స్థాయిలో పండించలేకపోయింది. వినయ్ కుమార్ హావభావాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.. చివర్లో శ్రావణి మజ్జారి చిన్న గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది.

సాంకేతికవర్గం పనితీరు: నిజానికి ఇదొక ఇండిపెండెంట్ సినిమా. టెక్నికాలిటీస్ గురించి విమర్శించలేం. గుడప్పన్ సంగీతం వినసొంపుగా ఉన్నా.. మిక్సింగ్ కోసం ఇంకాస్త బడ్జెట్ పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే.. సినిమాటోగ్రాఫర్ వినీత్ పబ్బాతి వీలైనంత సహజంగా సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నించాడు కానీ.. సినిమాకి సరైన డి.ఐ చేసి ఉంటే కచ్చితంగా బెటర్ అవుట్ పుట్ వచ్చేది. ఇలా టెక్నికల్ క్రూ అందరూ తమకు వీలైనంతలో శ్రమించినప్పటికీ.. బడ్జెట్ పరిమితుల కారణంగా వారి కష్టం తెరపై పండలేదు.

ఇక దర్శకుడు శింగర మోహన్ పనితనం గురించి మాట్లాడుకోవాలి. ఫీమేల్ పాయింటాఫ్ వ్యూ లో సాగే కన్నడ సినిమా “గంటుమోటే” నుండి కాస్త ఇన్స్పైర్ అయినప్పటికీ.. డ్రామా విషయంలో నవ్యత చూపలేకపోయాడు. స్కూలు బెంచీలు, పరవళ్లు తొక్కే సెలయేరు, మనల్నే చూస్తున్నట్లుగా వంగే వృక్షాలు, మనసులోని అలజడిని అర్థం చేసుకున్నట్లుగా పడే వర్షం వంటివి ఒక పాటలోనో, ఒక సందర్భంలోనో నెమరువేసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ.. సినిమా మొత్తం అదే అంటే కష్టం.

అభంశుభం తెలియని తొలిప్రేమ భావాన్ని తెరపై కవితాత్మకంగా పండించడానికి అతడు పడిన శ్రమ, తెలుగు భాషపై అతడికి ఉన్న అభిమానాన్ని మెచ్చుకోవాల్సినప్పటికీ.. సినిమాను తెరకెక్కించే ఫార్ములాలో భావుకతతోపాటు భావోద్వేగానికి కూడా సమపాళ్లలో ప్రాముఖ్యత ఇచ్చి ఉంటే మరింత బాగుండేది. దర్శకుడిగా, రచయితగా తన మార్క్ ప్రూవ్ చేసుకున్న మోహన్, కథకుడిగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

విశ్లేషణ: “ఏరా ఏం ఆలోచిస్తున్నావ్?” అని అడగడానికి “నీ మస్తిష్కమునందు నీవు మధిస్తున్న విషయమేమి?” అని అడగడానికి చాలా తేడా ఉంటుంది. రెండు తెలుగు భాషలోనివే.. ఒకటి స్వచ్ఛమైనది, మరొకటి సరళమైన వాడుక భాషలోనిది. శింగర మోహన్ తెరకెక్కించింది జానపద చిత్రమో లేక పౌరాణిక చిత్రమో అయ్యుంటే.. ఈ తరహా గ్రాంథిక తెలుగు భాషా ఉపయోగంలో ఎలాంటి తప్పు లేదు. కానీ.. తన సినిమా టార్గెట్ ఆడియన్స్ ఎవరు. ప్రస్తుతం థియేటర్లకు వచ్చి ప్రేమకథలను చూసే జెన్ జీకి ఈ భాష ఎంతవరకు అర్థమవుతుంది అనే విషయాన్ని మోహన్ నిశీధిలో కూర్చుని నిశితంగా ఆలోచించి ఉంటే బాగుండేది.

మనకు వచ్చింది ఆడియన్స్ కు చూపించడం కంటే.. ఆడియన్స్ మెచ్చేది, నచ్చేది వారికి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగు భాష మీద అభిమానం పెల్లుబికిన తీరు చిన్నపాటి ఆనందాన్నిచ్చినా.. ప్రేక్షకులకు అందుబాటులో లేని శభ్దరత్నాకరం యొక్క ఆవశ్యకతను తెలియపరచడం కోసం థియేటర్లలో కూర్చోబెట్టడం అనేది ఒకింత అత్యాశే.

ఫోకస్ పాయింట్: కాలం చాలా విలువైంది!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus