రాజనీకాంత్ తాజా చిత్రం “కబాలి” జూలై 1న విడుదలవుతుందని యావత్ ప్రపంచంలోని రజనీ అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ.. వారి ఆశల మీద నీళ్ళు జల్లారు “కబాలి” దర్శకనిర్మాతలు. నిజానికి ఈ చిత్రం ఆడియో వేడుక జూన్ రెండో వారంలో జరగాలి. కానీ.. కారణాంతరాలవలన ఎటువంటి ఆర్భాటం లేకుండానే “కబాలి” ఆడియోను విడుదల చేయాలని డిసైడ్ చేశారు. అదే సందర్భంలో సినిమాను జూలై 1న కాకుండా జూలై 15కు వాయిదా వేస్తున్నట్లు కూడా తెలిపారు.
అయితే.. వాయిదాకు కారణాన్ని వివరిస్తూ, 15న రంజాన్ సంబరాలు మొదలవుతాయి, ఎలాగూ “కబాలి” సినిమాని మలేసియా, చైనా దేశాలలో కూడా విడుదల చేస్తాం కాబట్టి.. అన్నివిధాల కలిసివచ్చేలా జూలై 15వ తేదీని ఫిక్స్ చేసినట్లు వివరించారు. దర్శకనిర్మాతల ఆలోచన బాగానే ఉంది కానీ.. అభిమానులు మాత్రం కాస్త నిరాశకు లోనయ్యారు.
రాజనీకాంత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తుండగా, రాధికా ఆప్టే, ధన్సిక కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి స్వరసారధ్యం వహిస్తున్నారు!