2004 లో ‘క్యూ….హో గయా నా’ అనే హిందీ చిత్రం వచ్చింది. వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ కోసం ఓ మోడల్ ను తీసుకున్నారు. ఆ మోడల్ మరెవరో కాదు మన కాజల్. జూన్ 19 వ తేదీ గా 1985 లో ముంబై లో జన్మించింది కాజల్. బాలీవుడ్ నుండే ఈమె యాక్టింగ్ కెరీర్ ను మొదలు పెట్టేసింది. అయితే ఈమెకు బ్రేక్ ఇచ్చే సినిమా మాత్రం తొందరగా రాలేదు. అలా నార్త్ నుండీ సౌత్ కి వచ్చి తేజ సినిమా ఆడిషన్స్ కి హాజరైంది. అలా ఆమెకు ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.
కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ప్లాపయింది. అయితే కాజల్ నటనకి, గ్లామర్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే తరువాత వచ్చిన ‘చందమామ’ చిత్రం హిట్టవ్వడంతో కాజల్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత సుమంత్ హీరోగా వచ్చిన ‘పౌరుడు’, నితిన్ హీరోగా వచ్చిన ‘ఆటాడిస్తా’ వంటి చిత్రాల్లో నటించినా ఈమెకు కలిసొచ్చిందేమీ లేదు. అయితే 2009 లో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో రాంచరణ్ హీరోగా వచ్చిన ‘మగధీర’ చిత్రం కాజల్ కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ కావడం అలాగే… ‘ఇందు’ ‘మిత్రవిందా దేవి’ పాత్రలకి ఈమె ప్రాణం పోసిందనే చెప్పాలి. ఆ వెంటనే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య2’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది
ఆ చిత్రంలో కూడా ‘గీత’ పాత్రతో మంచి పేరు కొట్టేసింది. ఇక అక్కడ నుండీ కాజల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జూ.ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో రెండేసి సినిమాలు చేసిన కాజల్… కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కుర్ర హీరోయిన్లు ఎంతమంది వచ్చినా పోటీ తట్టుకుని ఇప్పటికి అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక కాజల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్లో ఉంది. కాజల్ కు ‘కల్ట్ ఫ్యాన్స్’ కూడా ఉన్నారు. ఈరోజుతో కాజల్ 33 ఏళ్ళు పూర్తి చేసుకుని 34 వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది.