‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD).. ఇది ఒక పార్టు సినిమా కాదు అని, కచ్చితంగా రెండు పార్టులుగా సినిమా వస్తుందని టీమ్ చెప్పకపోయినా తేల్చేశారు సినిమా జనాలు. అయితే సినిమా క్లైమాక్స్‌లో టీమ్ అనౌన్స్ చేసిన దాని బట్టి.. ఇది ఒక పార్టు కాదు, రెండు పార్టులు కాదు.. ఏకంగా సినిమాల మీద సినిమాలు వస్తుంటాయి. అందుకుగా ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ను దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) అనౌన్స్ చేశారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా క్లైమాక్స్‌కి వచ్చేసరికి సినిమా కథ ఇంకా చాలా ఉంది అనేలా చూపిస్తారు.
నిజానికి అప్పటివరకు చూపించిన కథేమీ లేదు కాబట్టి. ట్రైలర్‌లో చూపించిన కథనే యాజ్ ఇట్ ఈజ్ సినిమాలో చూపించారు. అయితే మధ్య మధ్యలో సన్నివేశాలను పేర్చుకుంటూ వచ్చారు. అయితే సినిమా ఎండింగ్‌లో వదిలేసిన ప్రశ్నలు, చూపించాల్సి ఉన్న కంటెంట్ చూస్తుంటే ఇది సీక్వెల్‌తో ఆగేలా లేదు. ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్‌లో కనీసం మూడు, నాలుగు భాగాలు ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కథలో టచ్ చేసిన పాత్రలు, ఆఖరులో చూపించిన కీలకమైన పాత్రకు పేఆఫ్ చేయాల్సి ఉంది.
ఇది నెక్స్ట్ పార్ట్‌లో పూర్తవుతుంది అని చెప్పలేం. ఎందుకంటే యాస్కిన్ పాత్ర ఇంకా పూర్తిగా రూపాన్నే అందుకోలేదు. అది జరిగి, కల్కి జన్మించి అతనిని అంతం చేయాలి. పురాణాల్లో చెప్పింది ఇదే. ఇదంతా ఒక పార్టులో జరుగుతుంది అని ఊహించలేం. అలాగే సినిమా ఆఖరున వచ్చిన అశ్వత్థామ స్నేహితుడు (పేరు చెప్పేస్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి చెప్పడం లేదు) గురించి ఇంకా చాలా చెప్పాల్సింది, చూపించాల్సింది ఉంది అంటున్నారు.
ఈ నేపథ్యంలో సినిమాను రెండు పార్టులకో, మూడు పార్టులతో పూర్తి చేసే పరిస్థితి లేదు. అయితే ఎంతవరకు ఇన్ని పార్టులు ఓకే.. బడ్జెట్, కాల్‌షీట్లు అనేది మరో ప్రశ్న. మరి ఈ విషయంలో నాగీ మనసులో ఏముందో ఆయనే చెప్పాలి.