మన ఇండియన్ సినిమాకి సూపర్ హీరో సినిమా అనేది ఎప్పటినుంచో ఒక కల. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ సూపర్ మ్యాన్ ఫ్రీమేక్ చేసినా, ఆ తర్వాత చిరంజీవి “జగదేక వీరుడు అతిలోక సుందరి”తో కొంచం ట్రై చేసినా, నవతరంలో మాత్రం ఎవరూ ఆ సూపర్ హీరో థీమ్ ను ట్రై చేయలేకపోయారు. మలయాళంలో మాత్రం టోవినో థామస్ “మిన్నల్ మురళి”తో ఇండియన్ సూపర్ హీరో సినిమాలకి మంచి స్ఫూర్తినిచ్చాడు.
Kalyani Priyadarshan
అయితే ఆ సినిమా నెట్ ఫ్లిక్స్ లోనే రిలీజ్ అవ్వడం అనేది బాక్సాఫీస్ పొటెన్షియల్ ను జడ్జ్ చేయనివ్వకుండా ఆపేసింది. ఇక ప్రశాంత్ వర్మ “హనుమాన్”తో ఆ కలను సజీవం చేశాడు. అయితే.. టోవినో ఇచ్చిన ఇన్స్పిరేషన్ & ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన సెన్సేషన్ తో ఇప్పుడు మరో మలయాళీ దర్శకుడు ఈ ఇండియన్ సూపర్ హీరో ఫార్మాట్ లో సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు.
కల్యాణి ప్రియదర్శన్ టైటిల్ పాత్రలో “లోకా” అనే సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేశాడు దుల్కర్ సల్మాన్. తన స్వంత బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈరోజు దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా “లోకా” టీజర్ ను రిలీజ్ చేశాడు. కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హ్యూమన్ గా కనిపించనున్న ఈ చిత్రంలో ఆమెకు చాలా పవర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మల్టీపుల్ పవర్స్ ను జోడించి ఈ లోకా క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లున్నారు.
కల్యాణి ప్రియన్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. ఒకవేళ ఈ సినిమా కూడా వర్కవుట్ అయితే ఈ సిరీస్ లో మరిన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసేందుకు దుల్కర్ రెడీగా ఉన్నాడు. మరి ఈ సూపర్ హ్యూమన్ ఫార్మాట్ ఏమేరకు సక్సెస్ అవుతుంది అనేది ఓనం రోజుకీ తెలుస్తుంది.