ఏడేళ్లుగా లోక నాయకుడు కమల్ హాసన్ అభిమానుల మనసులో ఓ కోరిక ఉంది. తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలసి నటిస్తే.. చూడాలని! నటుడిగా భారతీయ చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన కథానాయకుడు కమల్ హాసన్. ఈయన నట వారసురాలిగా 2009లో హిందీ చిత్రం ‘లక్’తో తెరంగేట్రం చేసింది శృతి హాసన్. అంతకు ముందు బాలనటిగా ‘హే రామ్’లో తండ్రితో కలసి అతిథి పాత్రలో కనిపించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తండ్రికి తగ్గ తనయురాలిగా.. నటిగా.. శృతి మంచి పేరు తెచ్చుకుంది. ‘లక్’ తర్వాత నుంచి కమల్, శృతి కలసి ఓ చిత్రంలో నటించాలని అభిమానులు కోరుతున్నారు. వాళ్ల కోరికను ఈ ఏడాది కమల్ తీరుస్తున్నారు. వీరిద్దరూ కలసి నటించబోయే చిత్రం ఏప్రిల్ 29న చెన్నైలో ప్రారంభమవుతుంది. కమల్ ఈ వార్తను ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఇళయరాజా సంగీత దర్శకుడు. ఏప్రిల్ 29 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలున్నాయి. వెండితెరపైనా కమల్, శృతిలు తండ్రీకూతుళ్లుగా నటించడం ఓ ప్రత్యేకత అయితే.. 26ఏళ్ల తర్వాత కమల్ కథానాయకుడిగా రాజీవ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తుండడం మరో ప్రత్యేకత. శృతి గాయనిగా పరిచయమైన ‘తేవర్ మగన్’ చిత్రానికీ, బాలనటిగా పరిచయమైన ‘హే రామ్’ చిత్రానికీ సంగీతం అందించిన ఇళయరాజా.. పెద్దయిన తర్వాత తండ్రితో కలసి ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. మలయాళ, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.