పరిచయం అవసరం లేని పేరు కమల్ హాసన్. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, దర్శకుడిగా, కథకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా.. ఇలా అన్నీ రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్ ప్రస్తుతం నాయకుడిగానూ తమిళనాట రాజకీయాల్లో తనదైన మార్క్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్న విషయం తెలిసిందే. అలాగే.. “కిస్టోఫర్ నోలన్” అనే పేరు కూడా దాదాపుగా అందరు సినిమా అభిమానులకి తెలిసిందే. నవతరం దర్శకులకు దిక్సూచిలాంటి నోలన్ తెరకెక్కించిన “ఇంటర్ స్టెల్లార్, డన్ కిర్క్” చిత్రాలు భవిష్యత్ దర్శకులకు పాఠ్యాంశాలుగా పనికొస్తాయి. అలాంటి ఈ ఇద్దరూ నిన్న ఓ సందర్భంలో కలిశారు.
వీరి కలయిక సందర్భంగా కమల్ హాసన్ తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో “నోలన్ ను కలిశాను, ఆయన తెరకెక్కించిన “డన్ కిర్క్” చిత్రాన్ని డిజిటల్ వెర్షన్ లో చూసినందుకు సారీ చెప్పి, నేను నటించిన “హే రామ్” డిజిటల్ వెర్షన్ ఆయనకి ఇచ్చాను” అని ఒక పోస్ట్ పెట్టాడు. నోలన్ ను కమల్ కలవడం వెనుక ఆంతర్యం ఏమిటి, కమల్ పెట్టిన కామెంట్ ఏమిటి అనేది ఎవరూ పట్టించుకోలేదు. అందరి ఆలోచన ఒకటే.. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక హాలీవుడ్ సినిమా వస్తే ఎలా ఉంటుందా అని. ఈ ఊహ నిజమయ్యే అవకాశాలు లేకపోయినా.. పొరపాటున నిజమైతే మాత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది పలికినట్లవుతుంది. చూద్దాం మరి కమల్ ఏమైనా కరుణించి, నోలన్ తన మెదకుడి పని చెప్పి ఒక మంచి సినిమా తీయగలిగితేగనుక సినిమా అభిమానులకు అంతకుమించిన అనుభూతి మరొకటి ఉండదు.