మాయదారి కరోనా వచ్చాక… ఎవరికి ఒంట్లో నలతగా ఉందన్నా భయపడాల్సి వస్తోంది. అలాంటిది స్టార్ హీరోలకు అనేసరికి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అందులోనూ సీనియర్ స్టార్ హీరోలు అంటే ఇంకా భయపడుతున్నారు. వయసు మీదపడటం, వరుస సినిమాలు చేస్తుండటం తదితర కారణాల వల్ల కరోనా లాంటివి వస్తే ఇబ్బందులు వస్తాయి అని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితిలోనే ప్రస్తుతం ఉన్నారు కమల్ హాసన్ అభిమానులు. అయితే వారికి ఊరట కలిగించే వార్త ఒకటి సోమవారం బయటకు వచ్చింది.
కమల్ హాసన్‌ను ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే. కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉండి, అవసరమైన వైద్యం తీసుకొని పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. బయటకొచ్చాక సినిమా పనులు చూసుకున్నారు, బిగ్బాస్ తమిళం షూటింగ్‌లో పాల్గొన్నారు కూడా. అయితే ఏమైందో ఏమో కానీ మళ్లీ కమల్ సోమవారం ఆసుపత్రికి వచ్చారనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో మళ్లీ కమల్‌కి ఏమైంది అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ.
కమల్ మొన్ననేగా కోలుకున్నారు.. ఇప్పటికిప్పుడు ఏమైంది అనేది ఆ చర్చల సారాంశం. అయితే వీటన్నింటికి ఫుల్‌స్టాప్ పెడుతూ మంగళవారం రాత్రి కమల్ టీమ్ అధికారిక సమాచారం అందచేసింది. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరిన విశ్వనటుడు కమల్‌హాసన్ డిశ్ఛార్జి అయ్యారని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న కమల్ తాజాగా మరోసారి వైద్య పరీక్షల కోసం సోమవారం పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారని తెలిపారు.
కమల్‌కు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆయన మంగళవారం ఉదయం డిశ్ఛార్జి అయ్యారు. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా హమ్మయ్య అనుకున్నారు. అయితే ఈ విషయంలో ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే అభిమానుల్లో ఆందోళన ఉండదు కదా అనే మాటలూ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కమల్… లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పనులు కూడా ఆఖరిదశకు చేరుకున్నాయి. ఇవి కాకుండా నిర్మాతగా ‘రాజ్‌కమల్ ఫిల్మ్స్’ పతాకంపై వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే శివకార్తికేయన్‌తో సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.