బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది కంగనా రనౌత్. మొదటినుంచి కూడా ఆమె మోడీ సపోర్టర్. దీంతో బీజీపీ విధానాలను వ్యతిరేకించే వారిపై విరుచుకుపడుతుంటుంది కంగనా. దీంతో ఆమె బాధితులు కోర్టులను, పోలీస్ స్టేషన్ లను ఆశ్రయిస్తున్నారు. కానీ కంగనా మాత్రం కోర్టులను, పోలీసులను లెక్క చేయడం లేదు. ప్రముఖ రచయితే జావేద్ అక్తర్ వేసిన పరువు నష్టం దావా కేసులో ఇప్పటివరకు పదకొండు సార్లు కోర్టుకి పిలిచినా..
కంగనా హాజరు కాలేదంటే ఆమె ధైర్యమేంటో అర్ధం చేసుకోవచ్చు. తనకు ఆ కేసును విచారిస్తున్న కోర్టుపై నమ్మకం లేదని.. జావేద్ పిటిషన్ ను మరో కోర్టుకి మార్చాలనేది కంగనా డిమాండ్. కానీ దీనికి కోర్టు అంగీకరించలేదు. దీంతో కంగనా కోర్టుకి హాజరు కావడం లేదు. జావేద్ అక్తర్ మాత్రం కంగనాపై కేసు పెట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆయన హియరింగ్ కి ఎన్నిసార్లు వస్తున్నా.. కంగనా మాత్రం రావడం లేదు.
దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని జావేద్ తరఫు లాయర్ కోర్టుని కోరుతున్నారు. ఈ మేరకు మరో పిటిషన్ దాఖలు చేశారు. కనీసం ఇప్పుడైనా కంగనా కోర్టుకు వెళ్తుందేమో చూడాలి. ఈ కేసుతో పాటు.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన రైతులను ఉద్దేశించి కంగనా చేసిన వ్యాఖ్యలపై ముంబైలో మరో కేసు నమోదైంది. సిక్కులను ఉద్దేశిస్తూ..
ఖలిస్తాన్ ఉగ్రవాదులు అని కంగనా వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ముంబైలో కొందరు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కూడా కంగనా విచారణకు హాజరు కావాల్సివుంది.