బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ (Kangana Ranaut) మరోసారి తన ఘాటు వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి, సంస్కృతి, కుటుంబ విలువలపై తన అభిప్రాయాలను బయటపెట్టిన కంగన, భారతీయ పెళ్లిళ్లను ప్రపంచంలోనే ఉత్తమమైనవి అని పేర్కొంటూ పాశ్చాత్య దేశాల్లో పెళ్లి వ్యవస్థ ఎలాంటి ఒడిదుడుకులకు గురవుతోందో వివరించింది. ముఖ్యంగా భారతీయులుగా మనం పెద్దలు కుదిర్చిన పెళ్లిలను గౌరవిస్తామన్న కంగన, అదే సమయంలో పాశ్చాత్య దేశాల్లో సంబంధాలు ఎంత అస్థిరంగా ఉంటాయో ఓ ఉదాహరణతో వివరించింది.
హాలీవుడ్ టాప్ కపుల్ జెన్నిఫర్ లోపెజ్ – బెన్ అఫ్లెక్ సంబంధాన్ని ప్రస్తావించిన కంగన, వారు ఎన్నో సార్లు విడిపోయి మళ్లీ కలిశారని, అయినా స్థిరపడలేకపోయారని చెప్పారు. “అత్యంత విజయవంతమైన, సంపన్నమైన, అందమైన జంట అయినప్పటికీ, పరిపూర్ణ జీవిత భాగస్వామిని వెతుకుతూ తమ యాభైలలో విడాకులు తీసుకోవడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది” అంటూ వ్యాఖ్యానించింది. డేటింగ్ కల్చర్‌పై మరోసారి తన వ్యతిరేకతను ప్రదర్శించిన కంగన, పాశ్చాత్య దేశాల్లో సంబంధాలు ఎందుకు నిలదొక్కుకోలేవో వివరించింది.
భారతీయ పెళ్లిళ్లలో కుటుంబ విలువలు, బాధ్యతలతో కలిసి పెరిగే అనుబంధం ఉంటుందని, అప్పటి వరకు అపరిచితులుగా ఉన్న భార్యభర్తలు కూడా జీవితాంతం కలిసే జీవించగలుగుతారని పేర్కొంది. “మనం 80 ఏళ్ల వయస్సులోనూ భార్యాభర్తలు చేతులు పట్టుకుని వాకింగ్‌కి వెళ్తాం, కానీ పాశ్చాత్య దేశాల్లో వయసుతో సంబంధం లేకుండా మళ్లీ మళ్లీ సంబంధాలను మార్చుకుంటుంటారు” అంటూ పాశ్చాత్య డేటింగ్ కల్చర్‌పై విమర్శలు గుప్పించింది. ఇదే మొదటిసారి కాదు, గతంలోనూ కంగన ప్రేమ కథల మీద, బాలీవుడ్‌లో ప్రేమ కథా చిత్రాలను ఎక్కువగా తీయడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసింది.
ఆమె నిన్న మొన్నటి వరకు తన దర్శకత్వంలో వచ్చిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) సినిమాతో బిజీగా ఉండగా, అది ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇప్పుడు మళ్లీ ఆర్. మాధవన్‌తో (R.Madhavan) కలిసి నటించేందుకు సిద్ధమవుతోంది. ‘తను వెడ్స్ మను’ (Tanu Weds Manu) వంటి క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కంగన వ్యాఖ్యలు ఎలాంటి చర్చలకు దారి తీస్తాయో, ఆమె కొత్త సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.