నీలి చిత్రాల తార సన్నీ లియోన్ ని బాలీవుడ్ ఆహ్వానించి నటిని చేసింది. టాలీవుడ్ లో కూడా ఆమె నటించింది. మంచు మనోజ్ కరెంట్ తీగ సినిమాలో టీచర్ గా కనిపించింది. రీసెంట్ గా సన్నీ తెలుగులో చేసిన డియ్యో డియ్యో ఐటెం సాంగ్ “గరుడ వేగ” సినిమా విజయానికి దోహదపడింది. అంత క్రేజ్ ఉంది కాబట్టి భాషతో సంబంధం లేకుండా అందరూ ఆమె తమ సినిమాలో ఉండాలని కోరుకుంటున్నారు. అంతేకాదు సన్నీతో లీడ్ రోల్ చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. “అమోఘవర్ష నృపతుంగ” కథ ఆధారంగా 100 కోట్ల బడ్జెట్ తో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఓ సినిమాని తెరకెక్కించాలని దర్శకనిర్మాతలు భావించారు.
అందులో వీర మహాదేవి పాత్రను సన్నీలియోన్ పోషించేందుకు సంతకాలు కూడా అయిపోయాయి. ఈ విషయం తెలిసి సన్నీలియోన్ పై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. ఆమెకు వ్యతిరేకంగా బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక యువసేన ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. “నీలి చిత్రాల్లో నటించిన సన్నీలియోన్ వీర మహాదేవి పాత్రను పోషించడం దారుణం. ఈ సినిమా షూటింగ్ ను వెంటనే నిలిపి వేయాలి” అని కన్నడ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.