‘మగధీర’ (Magadheera) సినిమా తొలుత అనుకున్నది సూర్యతో అని.. ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. నిజంగా ఆయననే అనుకొని ఆ తర్వాత రామ్‌చరణ్ రంగంలోకి దిగాడా అనేది తెలియదు కానీ.. ఓ వార్త అయితే ‘కంగువ’ (Kanguva) ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి రన్ అవుతోంది. అప్పుడేమైందో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం ఓ సినిమా సూర్య (Suriya) , రామ్‌చరణ్ (Ram Charan) మధ్యలో ఉంది అని తెలుస్తోంది. కర్ణాటక సినిమాలో వైవిధ్యమైన దర్శకుడిగా పేరున్న నర్తన్.. ఓ కథను సిద్ధం చేశారట.
చాలా రోజులుగా నాన్ శాండిల్ వుడ్ సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్న ఆయన ఆ కథను పలువురు హీరోలకు వినిపించారు అని తెలుస్తోంది. ఈ క్రమంలో నిర్మాత ఓకే అయ్యారు అని సమాచారం. ఇక హీరో ఎవరు అనేదే ప్రశ్నగా మిగిలింది అని చెబుతున్నారు. శాండిల్ వుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న దర్శకులు టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ‘కేజీయఫ్’ (KGF) సినిమాలతో యశ్ (Yash) పాన్ ఇండియా దర్శకుడు అయ్యాకనే ఈ ఆలోచన మరింత పెరిగింది.
అలా ‘మఫ్టీ’తో తనంటే, తన సత్తా ఏంటో నిరూపించుకున్న నర్తన్ (Narthan) .. యశ్‌తో ఓ సినిమా చేస్తాడు అని వార్తలొచ్చాయి. అయితే ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో కొత్త సినిమాను యశ్ స్టార్ట్ చేసేశాడు. అలా లాంగ్ బ్రేక్ వచ్చిన తరువాత ‘భైరతి రణగల్’ (Bhairathi Ranagal) అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నర్తన్ మరో భారీ విజయం అందుకున్నారు. దీంతో నర్తన్ పాన్ ఇండియా సినిమా చర్చ మళ్లీ మొదలైంది.
ఈ క్రమంలో ‘భైరతి రణగల్’ సినిమా ప్రచారంలో నర్తన్ మాట్లాడుతూ కేవీఎన్ ప్రొడక్షన్స్‌లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని, ఆ సినిమాలో హీరోగా రామ్ చరణ్ కోసం ట్రై చేస్తున్నామని చెప్పారట. చరణ్ వరుస ప్రాజెక్టుల దృష్ట్యా డేట్స్ కుదరకపోతే, సూర్యతో ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తామని చెప్పారు. దీంతో ఇద్దరిలో ఎవరితో నర్తన్ తన పాన్ ఇండియా సినిమా చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.