సినిమా తీయడం వేరు, బాగా తీయడం వేరు.. బోత్ ఆర్ నాట్ సేమ. అలాగే సినిమాను ప్రమోట్ చేయడం వేరు, బాగా ప్రమోట్ చేయడం వేరు. ఇవి కూడా బోత్ ఆర్ నాట్ సేమ్. ఇప్పుడు ‘కన్నప్ప’ (Kannappa) టీమ్ ఈ విషయాన్ని బాగా అవగాహనలోకి తెచ్చుకోవాలి అంటున్నారు నెటిజన్లు. దానికి కారణం టీజర్ వచ్చిన నేపథ్యంలో సినిమా మీద వస్తున్న విమర్శలు, జరుగుతున్న ట్రోలింగే. నాణ్యత విషయంలో సమస్య వస్తే సర్దుకుంటారు.. కానీ సినిమా జోనర్ విషయంలోనే చర్చ జరుగుతోంది.
అవును, ‘కన్నప్ప’ సినిమాను భక్తిరస చిత్రం అని చెప్పుకోవచ్చు. అయితే కన్నప్ప శివ భక్తుడి కాకముందు కాస్త మొరటుగా ఉండేవాడు. అయితే మంచు వారి ‘కన్నప్ప’ సినిమా టీజర్‌లో భక్తి కంటే యాక్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఎగిరి దూకడాలు, ఎగిరెగిరి తన్నడాలు.. ఇలా మొత్తం యాక్షనే. దీంతో ‘కన్నప్ప’ జోనర్‌కి దూరంగా సినిమా ప్రచారం మొదలైంది అని అంటున్నారు. దీనికి మరో కారణం సినిమాలో ఉన్న స్టార్స్ కంటే మిగిలిన ఎలిమెంట్స్ టీజర్‌లో ఎక్కువగా కనిపించడం.
‘కన్నప్ప’ సినిమాలో పాన్ ఇండియా స్టార్లు, వివిధ పరిశ్రమలకు చెందిన నటులు చాలామందే ఉన్నారు. వాళ్లంతా సినిమాలో అతిథి పాత్రలు చేసి ఉండొచ్చు. అయితే వాళ్లు టీజర్‌కు, సినిమాకు తీసుకొచ్చే అదనపు ఆకర్షణ ఎవరూ తీసుకురాలేరు. ప్రభాస్ (Prabhas) సంగతే తీసుకోండి. కేవలం ఒక్క ఫ్రేమే చూపించారు. అక్షయ్ కుమార్ (Akshay Kumar) పరిస్థితి కాస్త బెటర్. ఇక హీరోయిన్‌ను సగటు కమర్షియల్ నాయికలా తెరపై ప్రజెంట్ చేశారు. దీంతో ఎక్కడా ఇది భక్తిరస చిత్రం అనిపించలేదు.
దీంతో ట్వీటు రాయుళ్లు, నెటిజన్లు సినిమా మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే సినిమా ప్రచారానికి ఇంకా చాలా రోజులు ఉన్నాయి. దీంతో తప్పుల నుండి, పొరపాట్ల నుండి టీమ్ కోలుకుని ప్రచారాన్ని పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. మరి మోహన్‌బాబు (Mohan Babu) అండ్ కో. ఏం చేస్తారు అనేది చూడాలి.