కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం ‘కాంతారా’. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మనవాళ్లు కూడా ఆ సినిమాపై దృష్టి పెట్టారు. దీంతో నిర్మాతలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ సినిమా సక్సెస్ లో రిషబ్ శెట్టి నటన, దర్శకత్వంతో పాటు సంగీతం కూడా కీలకపాత్ర పోషించింది.
నేపథ్య సంగీతానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో ‘కాంతారా’ టీమ్ ట్యూన్స్ ను కాపీ చేసిందంటూ నోటీసులు రావడం వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. ‘కాంతారా’ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే ‘వరాహ రూపం’ సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ పాట ‘నవరస’కు కాపీ అని ‘తైక్కుడం బ్రిడ్జ్’ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేసింది. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా సోషల్ మీడియాలో నెటిజన్లను రిక్వెస్ట్ చేసింది.
‘కాంతారా’ టీమ్ కి తమకు ఎలాంటి సంబంధం లేదని.. తమ ‘నవరస’ సాంగ్ ను ఆ టీమ్ కాపీ చేసిందంటూ ‘తైక్కుడం బ్రిడ్జ్’ ఆరోపణలు చేస్తోంది. ఈ కాపీకి కారణమైన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ‘తైక్కుడం బ్రిడ్జ్’ టీమ్. అయితే ఈ ఆరోపణలపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు.
‘తైక్కుడం బ్రిడ్జ్’ బ్యాండ్‌ను మలయాళ సంగీత దర్శకుడు గోవింద్ వసంత, గాయకుడు సిద్ధార్థ్ మీనన్ కలిసి మొదలుపెట్టారు. గోవింద్ వసంత మలయాళంలో ఎన్నో హిట్టు సినిమాలకు పని చేశారు. ‘కాంతారా’పై కాపీ ఆరోపణల సంగతి పక్కన పెడితే.. రోజురోజుకి ఈ సినిమాను ప్రశంసించే వారి సంఖ్య పెరిగిపోతుంది. రీసెంట్ గా పూజా హెగ్డే ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.