సాధారణంగా ఒక సినిమాకి హైప్ తీసుకురావడం కోసం సదరు సినిమాను హిందీలో లేదా తమిళంలో స్టార్ హీరోలు రీమేక్ చేస్తున్నారని వార్తలు రాయించడం చేస్తుంటారు దర్శకనిర్మాతలు. “మాయ, నీదీ నాదీ ఒకే కథ, మజిలీ” సినిమాల టైమ్ లో అలాగే విడుదలైన వారం తర్వాత అక్కడ ఆ హీరో రీమేక్ చేస్తున్నాడు, ఇక్కడ ఈ హీరో రీమేక్ చేస్తున్నాడు అని వార్తలు రాయించుకొన్నారు దర్శకనిర్మాతలు. అయితే.. తమ సినిమా విడుదల తర్వాత ఇదే తరహాలో రీమేక్ న్యూస్ వస్తే పబ్లిసిటీ కోసమే అనుకొంటారేమో అనుకున్నాడో ఏమో కానీ.. విడుదలకు ముందే తన “డియర్ కామ్రేడ్” సినిమా హిందీ రీమేక్ అవ్వబోతోందని నిన్న రాత్రి ప్రకటన వచ్చేలా చేశాడు విజయ్ దేవరకొండ.
భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న జంటగా రూపొందిన “డియర్ కామ్రేడ్” ఈవారం (జూలై 26) విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా చూసిన కరణ్ జోహార్ కథ, కథనం నచ్చడంతో హిందీలో రీమేక్ చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ తో ఒప్పందం కుదుర్చుకోవడమే కాక.. సదరు చిత్రాన్ని తాను రీమేక్ చేస్తున్నట్లు తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా చెప్పుకొచ్చాడు. అసలే భీభత్సమైన క్రేజ్ ఉన్న “డియర్ కామ్రేడ్”కి ఈ హిందీ రీమేక్ కన్ఫర్మ్ అవ్వడంతో మరింత అటెన్షన్ లభించింది. విజయ్ మునుపటి బ్లాక్ బస్టర్ “అర్జున్ రెడ్డి” హిందీలో “కబీర్ సింగ్”గా రీమేకై 250 కోట్లు కలెక్ట్ చేయడమే కాక ఇప్పటికీ థియేటర్లలో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే.