అదండీ సంగతి!

ఓ ఒరలో రెండు కత్తులు.. ఓ చూరి కింద రెండు కొప్పులు ఇమడవు.. అని పెద్దలు చెబుతారు. స్టార్ హీరోయిన్ల ఇగో కథలను సినిమా ఇండస్ట్రీలో జనాలు కథలు కథలుగా చెప్పుకుంటారు. ముఖ్యంగా హిందీలో ‘క్యాట్ ఫైట్’ పేరుతో ఎక్కువగా ఇటువంటి కథలు వినిపిస్తాయి. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె తదితరులపై కంగనా రనౌత్ కస్సుమందంటూ కోకొల్లలుగా కథనాలు వినిపించాయి. నటిగా మూడు ఉత్తమ జాతీయ పురస్కారాలు అందుకున్న అటువంటి కంగనా.. మరో కథానాయికను పొగుడుతోంది. కపూర్ భామ కరీనా నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. “జబ్ వుయ్ మెట్ సినిమాలో గీత్ పాత్ర నుంచి ఈరోజు ‘కీ అండ్ కా’లో కియా బన్సల్ వరకూ.. ప్రతి సినిమాలోనూ అద్బుతంగా నటించింది. మిగతా హీరోయిన్లు అందరికీ హై స్టాండర్డ్స్ సృష్టించింది. ముఖ్యంగా ‘కి అండ్ కా’లో నేటి మహిళలు ప్రతీ రంగంలోనూ ఏవిధంగా పనిచేస్తున్నారనే విషయాన్ని చూపింది. ప్రగతిశీల చిత్రమిది” అని కంగనా రానుత్ చెప్పింది. ఉన్నట్టుండి కరీనాపై ప్రశంసల వర్షం కురిపించడం వెనుక కారణం ఏంటి? అని ప్రశ్నించగా.. “ఈ ప్రశంసలు అన్నిటికీ కరీనా అర్హురాలు” అని సమాధానం ఇచ్చింది. అదండీ సంగతి! బహుశా.. వచ్చే ఏడాది కరీనాకు జాతీయ పురస్కారం రావాలని కంగనా ఆశిస్తుందనుకుంట. ఈ వ్యాఖ్యల పట్ల మిగతా హీరోయిన్లు ఎలా స్పందిస్తారో? ఇటీవల కంగనాకు జాతీయ పురస్కారం లభించగా.. ప్రియాంక, దీపికలలో ఎవరోకరిని పురస్కారం వరిస్తే సంతోషించేవాడ్ని అని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ బహిరంగంగానే చెప్పారు. ఆ సందర్భంలో మరోసారి హీరోయిన్ల మధ్య కోల్డ్ వార్ బయటపడింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus