నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘అరమ్’. రియలిస్టిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట ఘన విజయం సొంతం చేసుకోవడమే కాదు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ఈ చిత్రాన్ని “కర్తవ్యం” పేరుతో తెలుగులో అనువదించి విడుదల చేశారు శరత్ మరార్. పాటలు, కామెడీ, యాక్షన్ లాంటి కమర్షియల్ అంశాలేవీ లేకుండా కేవలం ఎమోషన్ తో ప్రేక్షకుడ్ని థియేటర్లో రెండు గంటలపాటు కనురెప్ప వేయనీయకుండా కూర్చోబెట్టిన “కర్తవ్యం” చిత్ర సమీక్ష మీకోసం..!!
కథ:
బుల్లబ్బాయి (రామచంద్రన్)-సుమతి (సునులక్ష్మి)ల గారాలపట్టి ధన్సిక (మహాలక్ష్మి). తల్లి కూలి పని చేస్తుండగా.. పొలంలో ఆడుకుంటూ ఉన్న ధన్సిక ప్రమాదవశాత్తూ అక్కడి బోరుబావిలో పడిపోతుంది. మొదట 36 అడుగుల లోతుల పడిన ధన్సికను కాపాడడం సులభతరం అని భావించిన ప్రభుత్వ యంత్రాంగం తాడు సాయంతో ఆమెను పైకి లాగాలనుకొంటుంది. అయితే.. అప్పటికే భయపడిపోయి, నీరసపడిన ధన్సిక కొంచెం పైవరకూ వచ్చి మళ్ళీ మూడింతల లోతు అనగా 93 అడుగులకి పడిపోతుంది.
పాప ప్రాణం కాపాడడం కోసం, ఆమెను సురక్షితంగా బోరుబావి నుంచి బయటకు తీసుకురావడం కోసం సదరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మధువర్షిణి (నయనతార) ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా వినియోగించింది? ఇండియన్ ఆర్మీని సహాయం కోసం పిలిపించడమే కాక, తనకు అడ్డొచ్చిన రాజకీయ శక్తులను ఎలా ఎదుర్కొని తన కర్తవ్యాన్ని ధైర్యంగా, సమర్ధవంతంగా ఎలా నిర్వర్తించింది అనేది చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు:
నయనతార అద్భుతమైన నటి అన్న విషయం ఆమె మునుపటి చిత్రాలైన “రాజా రాణి, ఇంకొక్కడు, మాయ” చిత్రాలు చూసినప్పుడే జనాలకు అర్ధమైంది. అయితే.. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోయడమే కాక ఎంతో కష్టమైన భావాలను కూడా కేవలం కళ్ళతో పలికించిన విధానం ప్రశంసనీయం. బోరుబావిలో చిక్కుకున్న చిన్నారిని చూస్తూ కన్నతల్లి కంటే ఎక్కువగా ఆరాటపడిన తీరు, చిన్నారి ప్రాణాలతో బయటపడిన తర్వాత సంతృప్తితో కన్నీరు పెట్టిన విధానం చూస్తే నయనతారలోని పరిపూర్ణమైన నటి కనిపిస్తుంది. ఇది నయనతార నటవిశ్వరూపం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
నయనతార తర్వాత ఆమె స్థాయిలో సినిమాలో తమ నటనతో రక్తి కట్టించినవారు రామచంద్రన్, సునులక్ష్మిలు. దిగువ మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రులుగా వారి నటన, బిడ్డ బోరుబావిలో పడ్డప్పుడు వారు పడిన వేదన ప్రేక్షకుడి కంట కూడా నీరు తెప్పిస్తుంది.
ఇక డాక్టర్, పోలీస్ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్, లోకల్ ఎమ్మార్వో, వియార్వోలుగా నటించినవారందరూ పాత్రల్లో జీవించారు. ఆఖరికి జనాల్లో గుంపుగా కనిపించే నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేయడం అనేది ప్రశంసించాల్సిన విషయం.
సాంకేతికవర్గం పనితీరు:
ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. ఒకే ప్రదేశంలో సినిమా మొత్తం నడుస్తున్నప్పటికీ రిపీటెడ్ అని ఎక్కడా అనిపించదు. మహా అయితే ఒక ఆరేడు వందల గజాల విస్తీర్ణం ఉన్న ప్రదేశంలో సినిమా మొత్తం ఎలా తీశారు, ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా ఎలా చూపించారు అనేది భవిష్యత్ ఛాయాగ్రాహకులు నేర్చుకోవాల్సిన విషయం.
జిబ్రాన్ సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకి ఆయువుపట్టు. సన్నివేశంలోని బాధను భరించలేక కళ్ళు మూసుకున్నా కూడా, బ్యాగ్రౌండ్ స్కోర్ విన్నా కూడా కళ్ల వెంట కన్నీరు ఆగదు. ఎడిటర్, కలరిస్ట్ లను కూడా అభినందించితీరాలి.
అందరికంటే ముఖ్యంగా చిత్రాన్ని తమిళంలో నిర్మించిన ప్రొడ్యూసర్స్ ను, కథని నమ్మి కమర్షియల్ హిట్ కోసం కాక తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి చిత్రాన్ని అందించాలన్న ఆలోచనతో ఈ చిత్రాన్ని తెలుగులో ఉత్తమ ప్రొడక్షన్ వేల్యూస్ తో తెలుగులో డబ్బింగ్ చేసిన శరత్ మరార్ కృషిని మెచ్చుకోవాలి.
నయనతార పాత్రకు డబ్బింగ్ చెప్పిన సబితా రెడ్డి పాత్రకు తన వాయిస్ తో జీవం పోస్తే, డైలాగ్ రైటర్ రాజేష్ ఎం.మూర్తి లిప్ సింక్ ని చాలా జాగ్రత్తగా చూసుకొని రాసిన సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. సామాన్యుడు ప్రభుత్వాన్ని అడిగే ప్రశ్నలు వింటే “నిజమే కదా” అనిపిస్తుంది.
ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ గోపీ నాయర్ గురించి మాట్లాడుకోవాలి..
రచయితగా కెరీర్ ను ఆరంభించి ఇదే “అరమ్” (తెలుగులో ‘కర్తవ్యం’) కథను పట్టుకొని ఎంతో మంది స్టార్ హీరోల చుట్టూ తిరిగినా ఎవరూ చేయడానికి మూందుకు రాకపోవడంతో.. కథకి కాస్త మార్పులు చేసి లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్ గా మార్చి నయనతార చేత ఒకే చేయించుకొని, అతి తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యేవరకూ అసలు ఇలాంటి సినిమా ఒకటి ఉందని జనాలకు తెలియకుండా ప్లాన్ చేసుకొని.. టీజర్ నుంచి ట్రైలర్, పోస్టర్ తో ఆసక్తి పెంచి కరెక్ట్ టైమ్ లో సినిమాని రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకోవడం అనేది మామూలు విషయం కాదు.
అలాగే.. కామెడీ, ఫైట్స్, సాంగ్స్ అనేవి లేకుండా ప్రేక్షకుడ్ని రెండు గంటల సేపు థియేటర్ లో కదలనివ్వకుండా కూర్చోబెట్టడం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కష్టతరమైన పని అనే చెప్పాలి. కానీ.. గోపీ నాయర్ మాత్రం తాను రాసుకొన్న కథనంతో కట్టిపడేశాడు. ప్రభుత్వంలోని లోటుపాట్లను సున్నితంగా వివరిస్తూనే.. ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకొంటున్నారు అనే విషయాన్ని మాత్రం కాస్త ఘాటుగా చూపించారు. గోపీ నాయర్ ఇకపై కూడా ఇలా సమాజానికి పనికొచ్చే సినిమాలే తీయాలని కోరుకొందాం.
విశ్లేషణ:
కామెడీ సీన్లు చూసి నవ్వుకొని, యాక్షన్ సీన్స్ చూసి ఉత్సాహపడి ఎంజాయ్ చేద్దామనుకొనేవారు “కర్తవ్యం” చూడకండి. ఎందుకంటే.. ఇది ఒక సిన్సియర్ సినిమా. బోరుబావిలో పడ్డ చిన్నారి ఎప్పుడు బయటపడుతుంది అని సినిమాలోని పాత్రలు మాత్రమే కాదు, థియేటర్లోని ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తుంటారు? చిన్నారికి శ్వాస ఆడకపోతే.. సీట్ లో కూర్చున్న ప్రేక్షకుడు ఇబ్బందిపడుతుంటాడు, పాప ఎక్కడ బయటకి రాదో అన్న భయంతో కంగారుపడతాడు. ప్రేక్షకుడ్ని ఈస్థాయిలో లీనం చేసేలా ఈమధ్యకాలంలో వేరే ఏ సినిమా రాలేదు అంటే అతిశయోక్తి కాదు.
అందుకే.. ఒక మంచి సినిమా చూశామన్న సంతృప్తి కోసం “కర్తవ్యం” తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలను ఆదరిస్తేనే భవిష్యత్ లో ఈ తరహా సినిమాలు వస్తాయి, లేదంటే అవే రొట్ట సినిమాలు చూస్తూ గడిపేయాల్సిన దుర్గతి ఏర్పడుతుంది.
రేటింగ్: 3/5