రాజమౌళి సినిమా అంటే సంగీత దర్శకుడిగా కీరవాణినే ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘గ్లోబ్ ట్రోటర్’ వంటి పాన్ వరల్డ్ ప్రాజెక్టుకి కూడా ఆయనే సంగీత దర్శకుడు. ఈరోజు జరిగిన ఫస్ట్ లుక్ రివీల్ ఈవెంట్లో కీరవాణి స్పీచ్ కూడా హైలెట్ అయ్యింది. తనపై ఉన్న కంప్లైంట్ గురించి నేరుగానే ప్రస్తావించి.. మహేష్ బాబు- రాజమౌళి సినిమాకి తాను ఎలా పనిచేయబోతున్నాడో చెప్పుకొచ్చాడు కీరవాణి. ఇందులో ‘పోకిరి’ డైలాగులను రీ క్రియేట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.
అలాగే రిలీజ్ డేట్ పై కూడా హింట్ ఇచ్చేశారు కీరవాణి. కీరవాణి మాట్లాడుతూ.. “స్టూడెంట్ నెంబర్ 1 నుండి ఆస్కార్ వరకు నా తమ్ముడు రాజమౌళితో ఎన్నో అనుభవాలు.. ఎన్నో విడ్డూరాలు.అలాగే ధైర్యే సాహసే లక్ష్మీ అనే సూక్తిని నమ్మి సూపర్ స్టార్ ఎదిగారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు. ఆయనతో పనిచేసే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది.

అయితే ‘కీరవాణి మెలోడీ బాగా కొడతారు.. కానీ బీట్ స్లోగా ఉంటుంది’ అనే ముద్ర నాపై ఉంది. అది ఎందుకు వచ్చిందో తెలీదు. కానీ ఒక్కటే చెబుతున్నాను. ఈ మధ్యే ఓ కొత్త ఫ్లాట్ కొన్నాను. మహేష్ బాబు ఫ్యాన్స్ అయిన మీ గుండెల్లో కొత్త ఫ్లాట్ కొన్నాను. బిల్డర్ హ్యాండోవర్ చేసేశారు.టైల్స్ వేస్తున్నారు. ప్రొడ్యూసర్ హ్యాపీ.డైరెక్టర్ హ్యాపీ. మెలోడీ అదే.. బీటు కూడా నాదే.2027 సమ్మర్ కే గృహప్రవేశం” అంటూ చెప్పుకొచ్చారు.
