షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన కిరణ్ అబ్బవరం.. ‘రాజావారు రాణి గారు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. కానీ అది కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. కంటెంట్ పరంగా హిట్ అందుకుంది. తర్వాత ఓటీటీల్లో మంచి ఫలితాన్ని అందుకుంది లాక్ డౌన్ టైంలో ఈ చిత్రాన్ని తెగ చూశారు ప్రేక్షకులు. అటు తర్వాత ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ అనే చిత్రం చేశాడు. ఆ సినిమా పాటలు లాక్ డౌన్ లో ప్రేక్షకులు తెగ వినేయడంతో..
ఓపెనింగ్స్ భారీగా.. దీంతో టాక్ అటు ఇటుగా ఉన్నా సినిమా సేఫ్ అయిపోయింది. అయితే అటు తర్వాత వచ్చిన సినిమాల్లో ‘సమ్మతమే’ కొంత పర్వాలేదు అనిపించినా ‘సెబాస్టియన్’ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. అయితే లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ పర్వాలేదు అనిపించింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా సక్సెస్ మీట్లో కిరణ్ అబ్బవరం కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. నెపోటిజం పై కూడా అతను స్పందించాడు.
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “నా గత సినిమాలకు మీరిచ్చిన ఫలితాలను నేను గౌరవిస్తాను. నేను చేసిన సినిమాలు ఎలా ఉంటే అలాంటి ఫలితాలే వచ్చాయి అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ‘వినరో భాగ్యము విష్ణుకథ’ విషయంలో నేను మాట్లాడొచ్చు అనుకుంటున్నాను. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారు. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు కానీ కొన్ని బ్యాచులు ట్విట్టర్ ఓపెన్ చేయగానే ‘నీ సినిమా బాగోలేదు’ అని పుణె నుండి ఒకడు మెసేజ్ పెడతాడు.
పుణెలో ఉన్నవాడు నా సినిమా ఎలా చూస్తాడు? ఇలా ట్రోల్ చేసిన వారి వివరాలు చూస్తుంటే ఇక్కడివారు కాదని తెలుస్తోంది.కానీ మీరేం చేసినా ఇక్కడే ఉంటాను. నెపోటిజం ఇండస్ట్రీలో లేదు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ ప్రచారం చేసేవారు నెపోటిజాన్ని క్రియేట్ చేస్తున్నట్టు ఉంది. ఇలా చేస్తే.. నాలాంటి యంగ్ హీరోలు ఎలా ఎదుగుతారు.? ’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.