టాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త కాంబినేషన్లు, కొత్త చొరవల పరంపర నడుస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరోలపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ధనుష్ (Dhanush), శివ కార్తికేయన్ (Sivakarthikeyan), ప్రదీప్ రంగనాధ్ (Pradeep Ranganathan) లాంటి తమిళ నటులు తెలుగులో బలమైన మార్కెట్‌ను ఏర్పరుచుకుంటున్నారు. వీరి సినిమాలకు కలెక్ట్ అయ్యే వసూళ్లు, ఫ్యాన్ బేస్ చూస్తేనే వారి రెంజ్ అర్థమవుతోంది. ధనుష్ ఈ జాబితాలో ముందుండే పేరు. ‘రఘువరన్ బీటెక్’, ‘సార్’ (Sir) సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కుభేర’ (Kubera) సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా హిట్టైతే ధనుష్ ఇక టాలీవుడ్ స్టార్‌గా పక్కాగా ఫిక్స్ అయినట్లే. ఇకపై ఆయన ప్రతి సినిమా తెలుగు భాషలో స్ట్రెయిట్‌గా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే విధంగా శివ కార్తికేయన్ కూడా అంచెలంచెలుగా తెలుగులో తన స్థానం ఏర్పరుచుకుంటున్నాడు. తాజాగా ‘అమరన్’ (Amaran) సినిమా ద్వారా శివకి భారీ గుర్తింపు వచ్చింది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు మార్కెట్లోనే కాదు, నేషనల్ లెవెల్‌లోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది.
ఈ విజయంతో శివతో సినిమాలు చేయాలనే దర్శకులు, నిర్మాతలు పెరుగుతున్నారు. ఇక ప్రదీప్ రంగనాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘లవ్ టుడే’తో (Love Today) యూత్‌లో పాపులర్ అయిన ప్రదీప్, ‘డ్రాగన్’తో (Return of the Dragon) తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఈ సినిమా తెలుగులో విజయం సాధించడంతో మైత్రీ మూవీ మేకర్స్ సహా పలు నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. కొత్త జెనరేషన్ స్టార్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో ప్రదీప్‌కు మంచి గుర్తింపు వస్తోంది.
మొత్తానికి ధనుష్, శివ కార్తికేయన్, ప్రదీప్ రంగనాధ్ లాంటి తమిళ తారలు ఇప్పుడు టాలీవుడ్‌లో తమ మార్కెట్‌ను పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. సూర్య, కార్తి లాంటి సీనియర్లకు సరైన తెలుగు ప్రాజెక్ట్ రాకపోవడమే ఈ యువ తారలకు ప్లస్ అయిందని చెప్పాలి. ఈ త్రయం తెలుగులో ఎలా దూసుకెళ్తారో చూడాలి.