ఇప్పుడు కామెడీ ఏం కామెడీ అండీ.. ఒకప్పుడు అదిరిపోయే కామెడీ ఉండేది మన సినిమాల్లో అని అంటుంటారు మన పెద్దలు. ఒక్కోసారి వాళ్లు చెప్పింది కరెక్టే.. ఒకప్పటి కామెడీ చాలా ఆహ్లాదంగా, హుందాగా ఉండేది అనేవాళ్లు ఉన్నారు. మరికొందరైతే అప్పుడు, ఇప్పుడు ఒకటే అనేవాళ్లు ఉన్నారు. అయితే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అయినా జంధ్యాల కామెడీ అంటే ఓ బ్రాండ్. ఆయన తన సినిమాల్లో పండించిన హాస్యం సెపరేట్ స్టైల్ అంతే. ఇటీవల దీని గురించి ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మాట్లాడారు.
జంధ్యాల హ్యూమర్ సిటీ అవార్డులు పేరిట ఇటీవల ఓ వేడుక జరిగింది. అందులో కోట శ్రీనివాసరావుకు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా హాస్యం మీద కొన్ని కామెంట్స్ చేశారు. దీంతో తేడా ఏంటి అని కొందరు అనుకుంటుంటే.. ఇంకొందరేమో తేడా ఉంది అని అంటున్నారు. దీంతో ఈ విషయం మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జంధ్యాల పేరుతో అవార్డులు ఇచ్చారు కనుక ఆయన నేపథ్యంలోనే ఈ చర్చ మొదలైంది.
‘‘జంధ్యాల కామెడీ అని అంటుంటారు. కానీ అది కామెడీ కాదు.. జంధ్యాల హాస్యం అని అనాలి. ఆయన హాస్యం ఎప్పుడైనా, ఎవరితోనైనా పంచుకోదగ్గది. ఆయన పండించిన హాస్యం అమ్మ పాలు అయితే, ఇప్పుడు ఉన్న కామెడీ డబ్బా పాలు’’ అని కోట శ్రీనివాసరావు కామెంట్స్ చేశారు. జంధ్యాల హాస్యాన్ని, ఆయన టైమింగ్‌ను కొట్టేవాళ్లే లేరు అనేది కరెక్టే. కానీ ఇంత డిఫరెన్స్ ఉండేలా ఏం మార్పు అని అనుకుంటున్నారు నెటిజన్లు.
దాంతోపాటు ఆహుతులను గుండెల్ని పిండేసేలా మరికొన్ని మాటలు కూడా మాట్లాడారు (Kota Srinivasa Rao) కోట శ్రీనివాసరావు. జంధ్యాల అక్షరం తిని.. లక్షలు సంపాదించిన నటుణ్ని నేను అని కోట గొప్పగా చెప్పుకొచ్చారు. అంతేకాదు జంధ్యాల తర్వాత ఆ స్థాయికి తీసుకెళ్లిన మరో దర్శకుడు రేలంగి నరసింహారావు అని మెచ్చుకున్నారాయన. ఈ సందర్భంగా గతంలో జంధ్యాల వేసిన కొన్ని స్పాంటేనియస్ పంచ్‌ల గురించి కూడా కోట చెప్పారు.