ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయి.. ఆ తర్వాత సినిమాల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేసి కెరీర్‌ని ఇబ్బంది పెట్టుకుంది కృతి శెట్టి. బేబమ్మగా ‘ఉప్పెన’ సినిమాతో ఆమె అందుకున్న విజయం ఆషామాషీ కాదు. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ అంటూ రెండు విజయాలు అందుకున్నా.. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఇబ్బందికర ఫలితాన్నే అందుకున్నాయి. అయితే ఇతర భాషల పరిశ్రమలో విజయాలు అందుకుంటోంది. ‘ఏఆర్‌ఎం’ అంటూ మలయాళంలో మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ‘వా వాతియార్’/ ‘అన్నగారు వస్తారు’ అంటూ తమిళంలో సందడి చేయబోతోంది.
Krithi Shetty
ఈ నెల 12న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో కృతి వరుసగా మీడియాతో మాట్లాడుతోంది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది. ఈ సందర్భంగా కన్నీళ్లు కూడా పెట్టుకోవడం గమనార్హం. కెరీర్ ప్రారంభంలో వచ్చిన విమర్శలు, సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్‌పై రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయింది. మన కంట్రోల్‌లో లేని విషయాలకు మనల్ని బాధ్యులను చేస్తే బాధేస్తుంది. కెరీర్‌లో రిజెక్షన్స్ ఎదురైనా బాధ కలుగుతుంది. ఇండస్ట్రీకి రాక ముందు ఎవరు ఏమన్నా పట్టించుకునే దాన్ని కాదు. కానీ ఇప్పుడు తట్టుకోలేకపోతున్నా అని చెప్పింది కృతి.
చిన్న చిన్న విషయాలు కూడా తనను ప్రభావితం చేస్తాయని. అన్నీ పర్సనల్‌గా తీసుకోవడంతోనే ఈ పరిస్థితి అని కూడా చెప్పింది. అయితే ఇంత సెన్సిటివ్‌గా ఎందుకు మారిందో ఆమెకే తెలియడం లేదట. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం ఓ హోటల్‌లో తనకు ఎదురైన వింత అనుభవం గురించి కూడా చెప్పింది. తన తల్లితో కలసి ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు ఆత్మను చూశానని చెప్పింది. రూంలో లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత ఆత్మ కనిపించలేదు. మా పూర్వీకులని దేవతలుగా పూజిస్తాం. వాళ్లు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతుంటారని నమ్ముతాను. ఈ ఘటన వల్ల ఆ నమ్మకం మరింత బలపడింది అని చెప్పింది కృతి.