విశ్వక్ సేన్ (Vishwak Sen) మొదటిసారి లేడీ గెటప్ లో నటించిన చిత్రం “లైలా” (Laila). “బట్టల రామస్వామి బయోపిక్కు” (Battalaramaswamy biopic) సినిమాతో దర్శకుడిగా మారిన సంగీత దర్శకుడు రామ్ నారాయణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. “భగవంత్ కేసరి”తో (Bhagavath Kesari) సూపర్ హిట్ కొట్టిన సాహు గారపాటి (Sahu Garapati) ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ విడుదలైనప్పటినుండి ఈ చిత్రం మీద అంచనాల కంటే.. లేనిపోని హడావుడే ఎక్కువ జరిగింది. మరి సినిమాగా “లైలా” ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: తన తల్లి చివరి బహుమతి అయిన “సీత బ్యూటీ పార్లర్”ను నడుపుకుంటూ.. ఓల్డ్ సిటీ లేడీస్ అందరికీ ఫేవరెట్ అయిపోతాడు సోనూ (విశ్వక్ సేన్). సోనూ బారి నుండి తమ భార్యలను కాపాడుకోవడం కోసం భర్తలందరూ నానా ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ఆయిల్ అడల్ట్రేషన్ కేసులో చిక్కుకుంటాడు సోనూ. పోలీసులు, ఓల్డ్ సిటీ ప్రజలు సోనూ కోసం వెతుకుతుంటారు. వాళ్ళందరి నుండి తప్పించుకొని తిరుగుతూ, తనపై పడిన నిందలను తొలగించుకోవడం కోసం మేకప్ వేసుకొని “లైలా” (Laila) గా మారతాడు సోనూ.
ఆడ వేషం వేసుకున్న లైలా ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? అసలు సోనూని ఈ కేసులో ఇరికించింది ఎవరు? చివరికి ఏం జరిగింది? అనేది “లైలా” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: నటుడిగా విశ్వక్ పొటెన్షియల్ ఏమిటి అనే “హిట్ (HIT), గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” (Gangs of Godavari) చిత్రాలతో ప్రూవ్ చేసుకున్నాడు. అయితే.. గత మూడునాలుగు సినిమాలుగా అతడి నటనలో స్పార్క్ లోపించింది. డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ చాలా బద్ధకంగా ఉంటున్నాయి. ఎనర్జీ అనేది కనిపించడం లేదు. ఇక ఈ సినిమాలో “లైలా” పాత్రలో అందంగా కనిపించడం కోసం గంటల కొద్దీ కష్టపడ్డాడు కానీ.. సుకుమారం ఎక్కడా కనిపించకపోవడంతో, చిరంజీవి పేర్కొన్నట్లు “ప్రౌఢ”లా కనిపించాడే కానీ అమ్మాయిలా మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఓవరాల్ గా నటుడిగా మెప్పించలేకపోయాడు విశ్వక్.
హీరోయిన్ ఆకాంక్ష శర్మకు నటించేందుకు కనీస స్థాయి స్కోప్ లేదు. కేవలం అంగాంగ ప్రదర్శనకు మాత్రమే ఆమెను వినియోగించుకున్నారు మేకర్స్. అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) , బబ్లూ పృథ్వీరాజ్(Babloo Prithiveeraj), కామాక్షీలు తమ తమ పాత్రల్లో మెప్పించడానికి ప్రయత్నించారు కానీ.. ఏ ఒక్క పాత్ర సరిగా పండలేదు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు రామ్ నారాయణ్ ఈ కథను రాసుకున్న విధానంలోనే బోలెడు తప్పులు ఉన్నాయి. ప్రపంచప్రఖ్యాత “ఫెయిర్ & లవ్లీ” అనే బ్రాండ్ తమ ప్రొడక్ట్ కూడా తమ టైటిల్ లోని “ఫెయిర్”ను తొలగించి “గ్లో & లవ్లీ” అని 2020లో మార్చాల్సి వచ్చింది. అలాంటిది 2025లో విడుదల చేసే ఒక సినిమాలో అమ్మాయి నల్లగా ఉండడాన్ని ఏదో పాపంలా చూపించడం అనేది ఆలోచన పరంగా దర్శకుడు రామ్ నారాయణ్ ఎంత వెనకబడి ఉన్నాడు అనే విషయానికి ప్రతీక. ఇక డైలాగ్స్ లో డబుల్ మీనింగ్ వినడానికి చాలా ఇబ్బందిపడాలి. మరి సినిమాపై అతడి హోల్డ్ ఎంతమేరకు ఉంది అనేది తెలియదు కానీ.. ఓవరాల్ గా డైరెక్టర్ ఫెయిల్యూర్ అని చెప్పాలి.
లియాన్ జేమ్స్ సంగీతం, రిచర్డ్ ప్రసాద్ (Richard Prasad) సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉన్నాయి. అయితే.. లియాన్ జేమ్స్ చాలా చోట్ల “గంగూభాయ్” సినిమాలోని పాటను ఇష్టం వచ్చినట్లు వాడేసుకోవడం అనేది గమనార్హం. నిర్మాత సాహు గారపాటి ఏం చూసి కోట్లు ఖర్చు పెట్టారో ఆయనకే తెలియాలి.
విశ్లేషణ: ఒక హీరో క్యారెక్టర్ లేడీ గెటప్ వేయడానికి చాలా బలమైన కారణం ఉండాలి. “మేడమ్” సినిమాలో చావుబ్రతుకుల్లో ఉన్న బామ్మ కోసం రాజేంద్రప్రసాద్ అమ్మాయి వేషన్ వేస్తే, “చిత్రం భళారే విచిత్రం” సినిమాలో అద్దె ఇంటి కోసం నరేష్ లేడీ గెటప్ వేశారు. “లైలా”లో ఆ బలమైన కారణం లోపించింది. ఆ కారణంగా సినిమాకి కోర్ పాయింట్ అయిన లేడీ గెటప్ అనేది అస్సలు వర్కవుట్ అవ్వలేదు. కామాక్షి క్యారెక్టర్ ను తెరకెక్కించిన విధానం కూడా బాలేదు. ఇక విశ్వక్ పాత్ర తాలూకు క్యారెక్టర్ ఆర్క్ ఎక్కడ ఉందా అని వెతుక్కొనేసరికి సినిమా అయిపోతుంది.
అప్పటికే సెన్సార్ కత్తెర పడినప్పటికీ.. ఇబ్బడిముబ్బిడిగా ఇరికించబడిన డబుల్ మీనింగ్ డైలాగ్స్, అసభ్యకరమైన సన్నివేశాలు “లైలా”ను ఓ మోస్తరు సినిమాగా కూడా నిలవనివ్వలేదు. విశ్వక్ “మాస్ కా దాస్” అనే టైటిల్ కార్డ్ అప్డేట్ చేసుకోవడంలో చూపిన శ్రద్ధ, తన తదుపరి సినిమాల కథ, కథనాల విషయంలోనూ చూపిస్తే బాగుంటుంది. ఒక నటుడిగా అన్నీ రకాల పాత్రలు పోషించాలి, అన్నీ జోనర్ సినిమాలు చేయాలి అనే ఆసక్తి మంచిదే కానీ.. ఆ ఆసక్తి ప్రేక్షకుల్ని ఇబ్బందిపెట్టేలా కాక అలరించేలా జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది. లేకపోతే.. భవిష్యత్తులో విశ్వక్ సినిమాలు రిలీజయ్యేది, థియేటర్ల నుండి వెళ్ళిపోయేది కూడా ఎవరికీ తెలియకుండాపోతుంది.
ఫోకస్ పాయింట్: ఈ లొల్లేంది లైలా!
రేటింగ్: 1/5