లెజెండరీ కంపోజర్ ఇళయరాజా తన పాటల హక్కుల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. తన అనుమతి లేకుండా పాటలు వాడిన వారికి వరుసగా లీగల్ నోటీసులు పంపుతున్నారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ టీమ్ ఆయన పాటను వాడినందుకు ఇప్పటికే పరిహారం చెల్లించి వివాదాన్ని ముగించుకుంది. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ఇళయరాజా ఆగ్రహాన్ని రెండోసారి చవిచూడాల్సి వచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘డ్యూడ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న వేళ, ఈ సినిమాకు ఇళయరాజా రూపంలో పెద్ద షాక్ తగిలింది. తన పాపులర్ సాంగ్ “కరుత మచ్చాన్”ను సినిమాలో అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మైత్రీ సంస్థకు ఇది ఊహించని తలనొప్పిగా మారింది.
మైత్రీ సంస్థకు ఇది కొత్తేమీ కాదు. కొద్ది నెలల క్రితమే, అజిత్ హీరోగా వారు నిర్మించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విషయంలోనూ ఇళయరాజా సీరియస్ అయ్యారు. ఆ సినిమాలో తన మూడు పాటలను వాడటంపై ఆయన లీగల్ నోటీసులు పంపారు. ఆ వివాదం ఎంతవరకు వెళ్లిందంటే, చివరికి ఆ సినిమా డిజిటల్ వెర్షన్ (ఓటీటీ) నుంచి ఆ పాటలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ అనుభవం తర్వాత కూడా, మైత్రీ సంస్థ మళ్లీ ‘డ్యూడ్’ విషయంలో అదే తప్పు రిపీట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాము మ్యూజిక్ లేబుల్స్ (సోనీ మ్యూజిక్ వంటివి) నుంచి హక్కులు కొన్నామని నిర్మాతలు వాదిస్తున్నా, పాటలపైన పూర్తి ‘మోరల్ రైట్స్’ తనకే ఉన్నాయని ఇళయరాజా బలంగా వాదిస్తున్నారు.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘కి పాటలు తొలగించారు, ‘మంజుమ్మల్ బాయ్స్‘ డబ్బులు చెల్లించారు. మరి ఇప్పుడు బ్లాక్‌బస్టర్‌గా నడుస్తున్న ‘డ్యూడ్‘ విషయంలో మైత్రీ సంస్థ ఏం చేయబోతోంది? కోర్టులో పోరాడుతుందా, లేక పరిహారం చెల్లించి రాజీకి వస్తుందా? లేదా ఓటీటీ వెర్షన్ నుంచి ఈ పాటను కూడా తొలగిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.