Lakshya Review: లక్ష్య సినిమా రివ్యూ & రేటింగ్!

నాగశౌర్య 20వ చిత్రంగా 2020లో షూటింగ్ మొదలైన ఈ చిత్రం కోవిడ్ కారణంగా షూటింగ్ గ్యాప్స్ ఇస్తూ ఎట్టకేలకు ఇవాళ (డిసెంబర్ 10) థియేటర్లలో విడుదలైంది. “అశ్వద్ధామ” తర్వాత శౌర్య ఎంతో కష్టపడి నటించిన ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది. ఆర్చెరీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: పుట్టుకతోనే విల్లుబట్టిన యువకుడు పార్ధు (నాగశౌర్య). తాత ప్రోత్సాహంతో దేశం మెచ్చే ఆర్చర్ అవ్వాలనే ఆశయంతో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. అయితే.. తనను ఎంతగానో ప్రోత్సహించిన తాతయ్య (సచిన్ కెద్కర్) చనిపోవడంతో.. డ్రగ్స్ కి అలవాటు పడతాడు. ఆ డ్రగ్స్ మత్తు నుంచి పార్ధు ఎలా బయటపడ్డాడు? తన తాత కోరిక మరియు తన ఆశయాన్ని సాధించగలిగాడా? లేదా? అనేది “లక్ష్య” సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: శౌర్య ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒకెత్తు.. “లక్ష్య” ఒకెత్తు. క్యారెక్టరైజేషన్ ఫెయిల్ అయిన మాట వాస్తవమే కానీ అందుకోసం శౌర్య పడిన కష్టాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. మూడు డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాడు. పాత్ర కోసం అతడు పడిన కష్టం సెకండాఫ్ మొత్తం కనిపిస్తుంది. అయితే.. క్యారెక్టరైజేషన్ కి డెప్త్ లేకపోవడం వలన శౌర్య వేరియేషన్స్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. కేతికా శర్మ గ్లామర్ పార్ట్ కు న్యాయం చేసింది. కీలకపాత్రలో జగపతిబాబు ఆకట్టుకున్నారు. సచిన్, సత్య, రవిప్రకాష్ అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: ప్రతి చిత్రానికి తన నేపధ్య సంగీతంతో ప్రాణం పొసే కాల భైరవ మ్యాజిక్ ఈ చిత్రంలో కనిపించలేదు. పాటలు కూడా సోసోగా ఉన్నాయి. రామ్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని ఫ్రేమ్స్ ఏక్సెప్షనల్ గా ఉండగా.. మరికొన్ని ఫ్రేమ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. శౌర్య తర్వాత సినిమాకి పూర్తిస్థాయిలో న్యాయం చేసింది రామ్ అనే చెప్పాలి. ఆర్ట్ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది. చిన్న చిన్న పొరపాట్లు మినహా పెద్దగా వేలెత్తి చూపే మిస్టేక్స్ కనిపించలేదు.

దర్శకుడు సంతోష్ ఒక సాధారణ కథను అసాధారణమైన కథనంతో ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నాడు. ఆలోచన బాగున్నప్పటికీ.. ఆచరణలో మాత్రం చాలా లోపాలున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎమోషన్ తేలిపోయింది. అనవసరమైన సన్నివేశాలు స్క్రీన్ ప్లే ను పక్కదారి పట్టించాయి. అయితే.. నటీనటుల నుంచి మాత్రం ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. సో, కథకుడిగా తడబడినా, దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్నాడు.

విశ్లేషణ: భారీ అంచనాలు లేకుండా.. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం చూడదగిన సినిమా “లక్ష్య”. నాగశౌర్య కష్టం, మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడొచ్చు. కథనం, క్యారెక్టరైజేషన్స్ విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే మంచి హిట్ అయ్యేది. అవి లోపించడంతో ఒక మంచి ప్రయత్నంగా మిగిలిపోయింది.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Share.