సీనియర్ స్టార్ నటులు కోటా శ్రీనివాసరావు నిన్న అంటే జూలై 13న కన్నుమూశారు. ఆయన మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే తన నటనతో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. సీరియస్ రోల్స్ తో కూడా కామెడీ పండించగల సమర్థుడు కోటా. అది కూడా చాలా సహజంగా ఉంటుంది. అందుకే కోటా శ్రీనివాసరావుని ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. ఎక్కడో కృష్ణాజిల్లా,కంకిపాడు చెందిన కోటా నటనపై ఉన్న వ్యామోహంతో సినిమాల్లోకి అడుగు పెట్టారు. సినిమాల్లో కనుక క్లిక్ అవ్వకపోతే ఏడాది లోపే తిరిగి సొంత ఊరికి వెళ్లి పోవాలని అనుకున్నారు.
కానీ ఆయన టాలెంట్ చూసి ఏ దర్శకుడు వెనక్కి పంపిస్తాడు చెప్పండి. తర్వాత అదే జరిగింది. ‘ప్రాణం ఖరీదు’ తో మొదలైన ఆయన ప్రయాణం ఎక్కడా ఆగలేదు. ఆయన ఆయనకు బ్రేక్ రావడానికి 9 ఏళ్ళు టైం పట్టింది. 1987 నవంబర్ 27 న ‘అహ నా పెళ్ళంట’ అనే సినిమా వచ్చింది. దీంతో కోటా స్టార్ అయ్యారు. ఆయన కెరీర్లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది ఈ సినిమాలో ఆయన పోషించిన ‘లక్ష్మీపతి’ పాత్ర.
అయితే ఇది కోటా కోసం రాసుకున్న పాత్ర కాదు. దర్శకుడు జంధ్యాల ఈ పాత్ర కోసం కొత్త వారిని తీసుకుందాం అని అనుకున్నారట. కానీ నిర్మాత డా.డి.రామానాయుడు ఈ సినిమాలో ‘లక్ష్మీపతి’ పాత్ర చాలా కీలకమైంది. కాబట్టి దానికి న్యాయం జరగాలంటే రావు గోపాలరావు వంటి స్టార్ కరెక్ట్ అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారట. కానీ దర్శకులు జంధ్యాల ఆయన మాటకు ఏకీభవించలేదు. ‘స్టార్ తో చేసే వాళ్ళ ఇమేజ్ వల్లే ఆ పాత్ర హైలెట్ అయ్యింది అనుకుంటారు.
కానీ కొత్త వాళ్ళు చేస్తే.. ఆడియన్స్ ఆ పాత్రతో ట్రావెల్ అవుతారు’ అంటూ తన అభిప్రాయాన్ని గట్టిగా రామానాయుడుకి తెలియజేశారట. దీంతో రామానాయుడు ‘సరే..’ అని చెప్పి దర్శకులు జంధ్యాలకి నెల రోజులు టైం ఇచ్చారట. ఈ క్రమంలో ‘మండలాధీశుడు’ సినిమా చూశారట జంధ్యాల. కోటా నటనకు ఇంప్రెస్ అయిపోయి ‘నా లక్ష్మీపతి ఇతనే’ అని రామానాయుడుకి చెప్పారట. తర్వాత ఆయన మాటపై కోటాతో ‘లక్ష్మీపతి’ పాత్ర చేయించారు. సినిమా హిట్ అవ్వడానికి ఆ పాత్ర కాంట్రిబ్యూషన్ ఎక్కువగానే ఉందని చెప్పాలి.