లారెన్స్ మాస్టర్ – యాక్టర్ రవి రాథోడ్.. ఈ ఇద్దరి అనుబంధం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘నేను కలిస్తే లారెన్స్ మాస్టర్ కొడతారేమో’ అని రవి రాథోడ్ భయపడితే.. ‘నేను కొట్టను లేరా.. ఓసారి వచ్చి కలువు’ అని లారెన్స్ మాస్టర్ అన్నారు. ఈ నేపథ్యంలో రవి రాథోడ్.. వెళ్లి లారెన్స్ మాస్టర్‌ను కలిశారు. దీనికి సంబంధించి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఏమైందంటే?
‘విక్రమార్కుడు’, ‘ఆంధ్రావాలా’, ‘ఖడ్గం’, ‘జెమిని’, ‘మాస్’, ‘బొమ్మరిల్లు’, ‘డాన్’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ తదితర పాతికకుపైగా సినిమాలు చేసిన ఛైల్డ్ ఆర్టిస్టు రవి రాథోడ్. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో రవి అనాథ అయ్యాడు. రవిని గతంలో వరుస సినిమాల్లో తీసుకున్న లారెన్స్ మాస్టర్‌కు ఈ విషయం తెలిసి రవిని దత్తత తీసుకుని స్కూల్‌లో చేర్పించారు. కానీ రవి అక్కడి నుండి వచ్చేశాడు. హైదరాబాద్‌లో పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ క్రమంలో తాగుడుకు బానిసైపోయాడు.
ఈ విషయాన్ని ఒక యూట్యూబర్ అందరి దృష్టికి తీసుకొచ్చాడు. రవి రాథోడ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరికీ ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో చిన్నప్పుడు చదువు చెప్పించాలని చూసిన లారెన్స్ మాస్టర్‌ను మళ్లీ కలవలేకపోయావా అని అడిగారు. ఆ తర్వాత అతనేమన్నాడు.. దానికి లారెన్స్ ఏమన్నారు అనేది పైన చదివి ఉంటారు. ఈ నేపథ్యంలోనే రవి రాథోడ్ చెన్నై వెళ్లి లారెన్స్ ను కలిశాడు. చూసి చలించిపోయిన లారెన్స్ వెంటనే రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారట.
రవి రాథోడ్ ఆల్కహాల్ అడిక్షన్ తగ్గేందుకు మెడికల్ టెస్టులు చేయించి మందులు ఇచ్చారట. రవిని చూడగానే లారెన్స్ మాస్టర్ నీలా తాగేవాళ్లకు నేను సపోర్ట్ చేయను అని అన్నారట. ఏదో నువ్వు నాకు చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నా అన్నారట. రవిని చెన్నైలోనే ఉండమన్నారట. అయితే ఫ్రెండ్స్ ఉన్నారని హైదరాబాద్ వచ్చేశాడట. మాస్టర్ ఇచ్చిన డబ్బులతో కొత్త మొబైల్ కొనుక్కున్నాడట. చెన్నై నుండి వచ్చాక తాగుడు మానేశాడట. రవి ఇదేలా ఉంటూ ఆరోగ్యంగా మారాలని ఆశిద్దాం. లారెన్స్ మాస్టర్ సాయం నిలవాలని కోరుకుందాం.