ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రఫర్ లారెన్స్.. సేవా కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉంటారు. వివిధ రకాలుగా అవసరార్థులకు సాయం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో సొంత డబ్బును ఖర్చు పెట్టి మరీ సేవ చేస్తుంటారు. దీని కోసం ‘రాఘవ లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ స్థాపించారు కూడా. దీని ద్వారా ఇప్పటికే ఎంతో మందికి తనవంతు సాయం చేసిన ఆయన మరోసారి ఉదారత చాటారు. తన సొంతింటిని పాఠశాలగా మారుస్తున్నట్టు తెలిపారు. అందులో విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తానని తెలిపారు.
‘కాంచన 4’ సినిమాకి తీసుకున్న అడ్వాన్స్‌తో ఈ సేవా కార్యక్రమం షురూ చేశానని తెలిపిన లారెన్స్.. ఆ ఇంట్లో పెరిగిన ఓ విద్యార్థే త్వరలో ప్రారంభం కానున్న పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తారని కూడా తెలిపారు. దీంతో అభిమానులు, నెటిజన్లు లారెన్స్ ఆలోచనను మెచ్చుకుంటున్నారు. సినిమాలకు తీసుకునే అడ్వాన్స్‌ను సేవా కార్యక్రమాలకు వినియోగించడం లారెన్స్‌కు అలవాటు. చాలా ఏళ్లుగా ఆయన ఇలానే చేస్తున్నారు. ఇప్పుడు ‘కాంచన 4’ డబ్బుతోనూ అదే చేశారు.
నేను కట్టుకున్న తొలి ఇంటిని విద్యార్థుల కోసం పాఠశాలగా మారుస్తుండటం ఆనందంగా ఉంది. ఈ ఇల్లు నాకెంతో ప్రత్యేకం. డ్యాన్స్ మాస్టర్‌గా నేను సంపాదించిన డబ్బుతో కట్టించిన ఇల్లు ఇది. దాన్ని ఇంతకు ముందు అనాథాశ్రమంగా మార్చాం. అప్పుడు కుటుంబంతో కలసి అద్దె ఇంట్లో ఉండేవాడిని అని గుర్తు చేసుకున్నారు. ఆ ఇంట్లో (అనాథాశ్రమంలో) ఆశ్రయం పొందిన వారు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కొత్త ప్రయాణానికి మీ ఆశీస్సులు కావాలి. నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అని లారెన్స్ చెప్పారు.
అలాగే మరో విషయం గురించి కూడా లారెన్స్ స్పందించారు. ఆయన కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ వీడియో చూశారట. ఓ 80 ఏళ్ల వ్యక్తి తన భార్య తయారు చేసిన తినుబండారాలను రైళ్లలో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారట. ఆ కుటుంబానికి రూ.లక్ష సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా అని తెలిపారు. ఆయన వివరాల కోసం ప్రయత్నించినా దొరకలేదని, మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. మీకు ఆయన ఏదైనా ట్రైన్‌లో కనిపిస్తే స్వీట్స్ కొని, సపోర్ట్ చేయండి అని కూడా కోరారు.