అమెరికాలో తుదిశ్వాస విడిచిన ప్రఖ్యాత రచయిత్రి యద్ధనపూడి!
- May 21, 2018 / 05:30 AM ISTByFilmy Focus
అప్పటికి నవలలు చదవడానికి కూడా తెలుగులో ప్రత్యేకమైన కోర్స్ చేయాలేమో అని అందరూ అనుకొంటుండేవారు. అందుకు కారణం నవలా రచయితలు తమ తెలుగు సాహిత్య పరిజ్ణానం మొత్తం తాము రాసిన నవల ద్వారా తెలియజెప్పాలని చేసిన ప్రయత్నాలు 80, 90ల కాలంలో కొందరు సాధారణ చదువరులకి ఇబ్బంది కలిగించింది. అలాంటి సమయంలో పామరులకూ సైతం అర్ధమవ్వగల భాషలో నవలలు రాయడం మొదలెట్టి అందరికీ చేరువైన రచయిత్రి యద్ధనపూడి సులోచనారాణి. ఆమె రచనలు అందరికీ అర్ధమయ్యే భాషలో ఉండడమే కాదు, కుటుంబ సభ్యులందరూ చదువుకొనే రీతిలో ఉండడం ఆమెను అనతికాలంలోనే స్టార్ రైటర్ ను చేసింది.
ముఖ్యంగా.. కుటుంబ బంధాల నేపధ్యంలో డ్రామా క్రియేట్ చేసి నవలలు రచించిన మొదటి మహిళా రచయిత యద్ధనపూడి సులోచనారాణి. ఆమె రచనల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, మధ్య తరగతి అమ్మాయి వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి.
ఆమె రచించిన చాలా నవలలు సినిమాలుగా రూపొందాయి. “మీనా, సెక్రటరీ” వంటి చిత్ర రాజాలు ఆమె రచనలకు సినిమా రూపాలు. ఆఖరికి.. ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొంది ఘన విజయం సొంతం చేసుకొన్న “అ ఆ” సినిమా కూడా ఆమె రచించిన “మీనా” నవల నుంచి స్పూర్తి పొందినదే కావడం విశేషం.

















