నవదీప్ (Navdeep Pallapolu) టైటిల్ పాత్రలో చాలా ఏళ్ల విరామం అనంతరం తెరకెక్కిన చిత్రం “లవ్ మౌళి” (Love Mouli). అవనీంద్ర (Avaneendra) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్, పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: తల్లిదండ్రులు వాళ్లు విడిపోతూ.. వద్దనుకున్న కొడుకు మౌళి (నవదీప్). సమాజానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా తాతయ్య చెంత పెరుగుతాడు. ఇష్టం వచ్చినట్లు బ్రతకడమే జీవితం అనుకునే చిన్నపాటి స్వార్ధపరుడు. తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా తనను అర్థం చేసుకొని, తనలానే ఉండాలని కోరుకునే కసాయి. ఆయువంటి మౌళికి.. తాను కోరుకునే లక్షణాలు గల అమ్మాయిని సృష్టించుకునే అవకాశం లభిస్తుంది.
ఆ అవకాశాన్ని మౌళి సద్వినియోగపరుచుకున్నాడా? అతడి మనస్తత్వం, ఆలోచనాధోరణి అతడికి ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? వాటిని మౌళి ఎలా అధిగమించాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “లవ్ మౌళి” చిత్రం.
నటీనటుల పనితీరు: ఫస్ట్ లుక్ రిలీజ్ మొదలుకొని సినిమా టైటిల్ కార్డ్ వరకు “నవదీప్ 2.0” అని వేస్తే, ఏదో గొప్పకి అలా వేసుకొంటున్నాడు అనుకొన్నాం కానీ.. నిజంగానే తనలోని ఒక కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు నవదీప్. నటుడిగా నవదీప్ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. కెరీర్ కొత్తలోనే చక్కని పాత్రల్లో తన సత్తాను ఘనంగా చాటుకున్నాడు. అయితే.. ఈ చిత్రంలో మౌళి అనే పాత్రలో యావత్ మగజాతి కనెక్ట్ అయ్యేలా క్యారెక్టర్లో జీవించడం అనేది ప్రశంసనీయం.
నవదీప్ అదరగొట్టేశాడు అనుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం కాస్త చిరాకు పెట్టిన పంకూరి గిద్వాని (Pankhuri Gidwani).. సెకండాఫ్ లో చూపించిన వేరియేషన్స్ & హావభావాల విషయంలో చూపిన పరిణితికి షాక్ అవ్వడం గ్యారెంటీ. ఆమెతో అనవసరంగా చేయించిన ఓవర్ ఎక్స్ పోజింగ్ ఒక వర్గం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడానికి ఏమైనా పనికొచ్చిందేమో కానీ.. నటిగా ఆమె క్యారెక్టర్ ఎలివేషన్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు. అయితే.. ఆమె క్యారెక్టర్ ఆర్క్ ఈమధ్యకాలంలో వచ్చిన హీరోయిన్ రోల్స్ లో బెస్ట్ అని చెప్పాలి.
నవదీప్ మ్యానేజర్ గా కనిపించిన యువ నటి, మిర్చి హేమంత్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ప్రత్యేక పాత్రలో రానా ఏస్థాయిలో ఒదిగిపోయాడంటే.. అతడు రానా అని గుర్తించడానికి ప్రేక్షకులకు చాలా సమయం పట్టింది. ఈ విషయంలో రానాతోపాటు అతడి మేకప్ ఆర్టిస్ట్ ను కూడా మెచ్చుకోవాలి.
సాంకేతికవర్గం పనితీరు: ఈ సినిమాకి దర్శకుడు, రచయిత, ఎడిటర్ & సినిమాటోగ్రాఫర్ అయిన అవనీంద్ర ఐడియాలజీని ముందుగా మెచ్చుకోవాలి. ఒక సింపుల్ కోర్ పాయింట్ ను.. మోడ్రన్ సినిమా పాయింటాఫ్ వ్యూలో చెప్పిన విధానం బాగుంది. ముఖ్యంగా మగాడి మైండ్ సెట్ ను డీకోడ్ చేసి.. చాలా సింపుల్ గా వివరించిన విధానం మెచ్చుకొని తీరాలి. మనిషికి, అందునా మగాడికి ఆశ కంటే ఈగో ఎక్కువ. దొరికినదాంతో ఎప్పడు సంతృప్తిపడదు, మంచిలో చెడును, చెడులో తన పైశాచికత్వాన్ని చూసుకొంటుంటాడు.
ఈ తత్వానికి కాస్త రియాలిటీని అద్ది తెరపై చూపించడంలో అవనీంద్ర విజయం సాధించాడు. అయితే.. నవదీప్ 2.0 వెర్షన్ ను మరీ ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్టాఫ్ మొత్తం కేటాయించడం, అనవసరమైన కామెడీ ట్రాక్ సినిమాకి మెయిన్ మైనస్ గా నిలిచాయి. వాటిని కాస్త తగ్గించి.. మెయిన్ ట్రాక్ ను ఇంకాస్త చక్కగా ప్రెజెంట్ చేసి ఉంటే “లవ్ మౌళి” మరో స్థాయికి వెళ్లేది.
అయినప్పటికీ.. మేఘాలయ లొకేషన్స్ ను ఇంత అద్భుతంగా తెరపై చూపించినందుకు అవనీంద్ర ఒక టెక్నీషియన్ గా అభినందనీయుడు. గోవింద్ వసంత (Govind Vasantha) పాటలు, కృష్ణ నేపథ్య సంగీతం, గ్రాఫిక్స్ & ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ముఖ్యంగా.. క్లైమాక్స్ లో చూపించే పెయింట్ యొక్క ఫ్రేమ్ కొన్ని రోజులు సినిమా చూసిన ప్రేక్షకులు మనసుల్లో ఉండిపోతుంది.
విశ్లేషణ: ఒక చక్కని కథకు అంతే చక్కని కథనం తోడైతే వచ్చే అవుట్ పుట్ “లవ్ మౌళి”. ఫస్టాఫ్ విషయంలో కాస్త జాగ్రత్త అనవసరమైన సన్నివేశాలు ట్రిమ్ చేస్తే.. మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. నవదీప్, పంకూరి గిద్వాని నటన, గోవింద్ వసంత పాటలు, కళ్లు తప్పనివ్వని లొకేషన్స్ & విజువల్స్ కోసం తమ పార్ట్నర్స్ తో యువత కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.
ఫోకస్ పాయింట్: సగటు మగాడి మైండ్ సెట్ కి నిలువుటద్దం “లవ్ మౌళి”.