సినిమా కొంటే పాప్‌కార్న్ ఫ్రీ.. ఒక టికెట్‌కి మరో టికెట్ ఫ్రీ.. ఇంకా లేదంటే ఏదో రెస్టెంట్‌లో ఫుడ్ మీద డిస్కౌంట్ (ఇది బుకింగ్ ప్లాట్ ఫామ్ ఇచ్చే ఆఫర్) మనం ఎక్కువగా ఇలాంటి ప్రచారాలే చూసుంటాం. సినిమా చూసినవాళ్లకు లక్కీ డిప్ పెట్టి ప్రైజ్‌లు ఇస్తామని ఓ సినిమా ముందుకొచ్చింది. ఇంకో సినిమా ఏమో సినిమాలో విలన్ ఎవరో చెబితే ప్రైజ్ ఇస్తామని చెబుతోంది. ఇలాంటి ఆఫర్లు గత కొన్నేళ్లలో అయితే మనం ఎక్కడా వినలేదు, చూడలేదు కూడా.
కానీ, రెండు తెలుగు సినిమాలు ఈ తరహా ప్రయత్నం చేస్తున్నాయి. కావాలని చెప్పారో, అనుకోకుండా చెప్పారో కానీ ఈ రెండు ఆఫర్లూ ఒకే రోజు అనౌన్స్ చేశారు. సాయిరామ్ శంకర్ (Sairam Shankar) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’ (Oka Pathakam Prakaram). వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను (Oka Pathakam Prakaram) ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌లో స్పెషల్ ఆఫర్ అనౌన్స్ చేశారు.
సినిమా ఫస్టాఫ్ చూసి విలన్ ఎవరో కనిపెడితే రూ. 10 వేలు బహుమానం ఇస్తామని టీమ్ చెప్పింది. థియేటర్‌లో సినిమాకి వెళ్తే ఇచ్చే కూపన్‌లో విలన్ ఎవరో రాసి ఇంటర్వెల్ టైమ్‌లో సమయంలో అక్కడున్న బాక్స్‌లో వేస్తే.. సినిమా పూర్తయ్యాక ఒకొక్క థియేటర్‌లో ఒక్కో విజేతని ఎంపిక చేస్తారు. వారికి రూ.10 వేలు బహుమానంగా ఇస్తారు. మొత్తం 50 థియేటర్లలో ఈ పోటీ ఉంటుందట.
ఇక అక్షయ్, మమితా బైజు (Mamitha Baiju), ఐశ్వర్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ‘డియర్ కృష్ణ’ సినిమా టీమ్ కూడా ఓ ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు తెగే మొదటి వంద టికెట్లలో ఓ టికెట్‌ని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి, ఆ ప్రేక్షకుడికి రూ.10 వేలు బహుమానంగా ఇస్తారట. ఈ ఆఫర్ల కాన్సెప్ట్.. తొలి షోకి థియేటర్లకు జనాల్ని రప్పించడానికే అని అర్థమవుతోంది కదా.