ప్రఖ్యాత సినీ గేయ రచయిత అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈరోజు సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు మరణించారు.కొద్దిరోజులుగా ఈయన న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. నిన్నటి నుండీ పరిస్థితి విషమించడంతో వైద్య నిపుణులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈయన హెల్త్ అప్డేట్స్ ను కిమ్స్ వారు అందిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎంత ప్రయత్నించినా సిరివెన్నెల గారిని కాపాడుకోలేకపోయినట్టు వైద్యులు తెలిపారు. ఇక సిరివెన్నెల గారి వయసు 66 సంవత్సరాలు.
ఈయన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనకాపల్లి. ఈయనకి ఇద్దరు కుమారులున్నారు. పెద్దకుమారుడు యోగేశ్వర్ శర్మ . చిన్న కుమారుడు రాజా సినిమాల్లో నటిస్తున్నాడు. గతేడాది ఇతని పెళ్ళి జరిగింది. బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘జననీ జన్మభూమి’ సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన సీతారామ శాస్త్రిగారు.. సిరివెన్నెల చిత్రంతో బాగా పాపులర్ అయ్యారు.
ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు కూడా సిరివెన్నెల గారికి దగ్గర బంధువు. ఇక సిరివెన్నెల గారి మరణ వార్తతో టాలీవుడ్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. చిరంజీవి వంటి పెద్దలు సిరివెన్నెల గారు ఈరోజు మనమధ్య లేకపోవడం నిజంగా విషాదకరం అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.