విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటించి, నిర్మించి, సంగీతం సమకూర్చిన తాజా చిత్రం “మార్గన్” (Maargan). తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎప్పట్లానే తెలుగులో అనువాదరూపంలో విడుదల చేశారు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: హైదరాబాద్ నగరంలో ఒక అమ్మాయిని కారు నలుపు రంగుకు మార్చి మరీ హతమార్చిన ఘటనను పేపర్ లో చదివి ముంబై నుంచి సిటీకి వచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలెడతాడు ధృవ్ (విజయ్ ఆంటోనీ). ఆ కేసులో నిందితుడిగా భావించబడి.. పోలీసులకు చిక్కుతాడు అరవింద్ (అజయ్ దిషాన్) ( Ajay dhishan). అయితే.. అరవింద్ ను పట్టుకున్న తర్వాత ఈ హత్య కేసులో కొన్ని కీలక విషయాలు తెలుసుకుంటాడు ధృవ్. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? నల్లగా మార్చి చంపడానికి కారణం ఏమిటి? వీటి వెనుక ఉన్నది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే “మార్గన్” (Maargan) చిత్రం.
నటీనటుల పనితీరు: విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఎప్పట్లానే సింపుల్ పెర్ఫార్మెన్స్ తో లాగించేశాడు. సీరియస్ సీన్స్ వరకు పర్వాలేదు కానీ.. మిగతా సన్నివేశాల్లో మాత్రం తేలిపోయాడు. అజయ్ దిషాన్ (Ajay dhishan) క్యారెక్టర్ కి సరైన లాజిక్ లేకపోయినా నటుడిగా మాత్రం పర్వాలేదనిపించుకున్నాడు. అతడికి ఉన్న శక్తికి సరైన లాజికల్ వివరణ ఇచ్చి ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అయ్యేవారు. కానిస్టేబుల్ పాత్రలో మహానది శంకర్ కాస్తంత నవ్వించే ప్రయత్నం చేశారు. బ్రిగిడ సాగా సీరియస్ పాత్రలో ఆకట్టుకుంది. ఇక కీలకమైన పాత్రలో శేశ్విత రాజు మంచి పెర్ఫార్మెన్స్ తో అలరించింది. నిజానికి సినిమా మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతుంది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మంచి నటనతో బాగా ఎలివేట్ అయ్యింది శేశ్విత.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ డీసెంట్ గా ఉన్నాయి. అయితే.. సినిమా మూల కథ ఎగ్జైటింగ్ గా ఉన్నా, ఆ కథను అల్లిన విధానం బోర్ కొట్టించగా.. ఇక కథలోని చిక్కుముడులు విప్పిన విధానం సంతృప్తినివ్వలేకపోయింది. ఎందుకంటే.. థ్రిల్లర్స్ కి ట్విస్ట్ రివీల్ చేయడం అనేది చాలా క్రూషియల్. ఆ విషయంలో లియో జాన్ పాల్ తడబడ్డాడు. రెండు గంటలపాటు బిల్డ్ చేసిన సినిమాకి 5 నిమిషాల్లో కంగారుగా ముగించేయడం అనేది సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది.
విశ్లేషణ: చిక్కుముడులు వేయడం కంటే.. ఆ ముడులను విప్పే విధానం ఒక థ్రిల్లర్ సినిమాకి కీ పాయింట్. ఆ కీ పాయింట్ ను లియో జాన్ పాల్ డీల్ చేసిన విధానం మైనస్ అనే చెప్పాలి. అందువల్ల 100 నిమిషాలపాటు బిల్డ్ చేసిన థ్రిల్ మొత్తం ఆఖరి 20 నిమిషాల్లో నీరుగారిపోయింది. కథనం సరిగ్గా రాసుకుని, రీజనింగ్ అనేది ఇంకాస్త బలంగా ఉండుంటే మంచి సినిమాగా నిలిచేది.
ఫోకస్ పాయింట్: ట్విస్టుల్లో ఉన్న ఇంపాక్ట్ స్టోరీలో లేదు!
రేటింగ్: 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus