ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ‘రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో మాధవన్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకుడిగా కూడా పని చేశారు. డైరెక్టర్ గా మాధవన్ కి ఇది తొలి సినిమా. ఈ సినిమా అందరికీ రీచ్ అవ్వాలని చాలా కష్టపడ్డారు మాధవన్. ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్నారు. ఫైనల్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది.
అలానే ఓటీటీలో కూడా ఈ సినిమా బాగానే వర్కవుట్ అయింది. నిర్మాతలకు ఈ సినిమా మంచి లాభాలను తీసుకొచ్చింది. అయితే మాధవన్ ఈ సినిమా బడ్జెట్ కోసం నిధులు సేకరించే క్రమంలో తన ఇంటిని అమ్మేశారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. నిజానికి ఈ సినిమాకి మొదట మాధవన్ దర్శకుడు కాదని.. ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయాల్సిందని.. కానీ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో ఆయన తప్పుకున్నట్లు కథనం ప్రచురించింది.
దీంతో మాధవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాల్సి వచ్చిందని రాసుకొచ్చారు. ఇదే స్టోరీలో మాధవన్ కుమారుడు వేదాంత్ స్విమ్మింగ్ లో దేశం తరువాత పాల్గొని బంగారు పతకాలు సాధించాడంటూ మాధవన్ కుటుంబాన్ని కీర్తించారు. తాజాగా ఈ ఆర్టికల్ పై మాధవన్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఏమని రాసుందంటే..
‘ఓ యార్.. నేనేదో గొప్ప త్యాగం చేశానని మీరు నన్ను ఆకాశానికి ఎత్తేయద్దు.. ఎందుకంటే నేను నా ఇల్లే కాదు.. దేన్నీ కోల్పోలేదు. దేవుడి దయవల్ల రాకెట్రీ సినిమాలో పాలు పంచుకున్న అందరూ ఈ ఏడాది ఎక్కువ ఆదాయపన్ను చెల్లించనున్నారు. అంత గొప్పగా, గర్వించదగ్గ లాభాలు వచ్చాయి. నేను ఇప్పటికీ నా ఇంటిని ప్రేమిస్తున్నాను. అదే ఇంట్లో జీవిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.