“సినిమా పరిశ్రమలో ఎవరి సపోర్ట్ లేకుండా ఎదగాలన్నా, పేరు, డబ్బు సంపాదించాలంటే.. బాగా కష్టపడాలి.. కొన్ని మనకు నచ్చని పనులు, పాత్రలు చేయగలగాలి” అని బాలీవుడ్ నటి రాధికా ఆప్టే నిన్న సంచలనమైన కామెంట్స్ చేసింది. ఆమె మాటలు అన్ని పరిశ్రమలో సంచలనం రేకెత్తించింది. ఆమె మాటలకు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. చాలామంది నటీమణులు స్వయంగా కలిసి అభినందిస్తున్నారు. తెలుగు నటి మాధవీలత మాత్రం మీడియా ముఖంగానే ఆమెని సమర్ధించింది. రాధిక ఆప్టే చెప్పింది అక్షరాలా నిజమని స్పష్టం చేసింది. తనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తెలిపింది.
“అతిథి సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ నన్ను మహేష్ బాబు ముందే బూతులు తిట్టాడు. అక్కడ నాకు ఎవరి నుండి ఎలాంటి మద్దతు లభించకపోవడంతో అక్కడి నుండి వెళ్లిపోయాను” అని అప్పటి సంగతిని గుర్తుచేసుకుంది. సినిమాల్లో ఆడపిల్లని అల్లరి చేస్తే ఫైట్ చేసే హీరో మహేష్ నిజ జీవితంలో నన్ను బూతులు తిట్టినా “ఆడ పిల్లతో అలా మాట్లాడకూడదు కదా” అని డైరెక్టర్‌కు ఒక మాట కూడా చెప్పలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పినప్పుడు అతని అభిమానులు తనపై ఆగ్రహం వ్యక్తం చేసారని వెల్లడించారు. “రాధిక ఆప్టే తెలుగులో ఓ పెద్ద హీరో మీద కామెంట్స్ చేసింది. కానీ ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. ఆయన పెద్ద హీరో కాబట్టే అందరికీ భయం. చంపేస్తారేమో? కాల్చేస్తారేమో? కొట్టేస్తారేమో? అనే భయంతో ఇండస్ట్రీలో ఎవరూ నోరు విప్పలేదు. టాలీవుడ్ పెద్ద హీరోలకు రాచరికపు రాజ్యం లాంటిది. రాజు ఏం చేస్తే అది నడుస్తుంది. వాళ్ల దృష్టిలో ఇతరులంతా బానిసలు” అని మాధవి లత విమర్శలు గుప్పించింది.