ప్రపంచంలోనే సినిమా రంగానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అంటే అది ఆస్కార్. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా రూపొందిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఘనంగా అవార్డులు అందించే ఈ ఈవెంట్ కోసం పలు దేశాల సినీ బృందాలు ఎదురు చూస్తుంటాయి. వచ్చే సంవత్సరం 2026లో జరగనున్న 98వ ఆస్కార్ అవార్డుల ఎంపిక ప్రక్రియ మొదలైనది. ఇప్పటికే పలు కేటగిరీల్లో నామినేషన్‌ల జాబితా వెల్లడించగా, అందులో మన దేశం నుంచి ఆస్కార్ బరిలో ఒక ప్రత్యేక సినిమా చోటు దక్కించుకుంది.
తాజాగా విడుదలైన యానిమేషన్ విభాగ నామినేషన్లలో “మహావతార్ నరసింహ” చిత్రం అఫిషియల్ గా ప్రకటించబడింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి, యానిమేషన్ ప్రపంచంలో సంచలనంగా నిలిచిన ఈ చిత్రం, దేవీదేవతల కథల్ని అత్యద్భుత విజువల్స్‌తో కొత్త స్థాయిలో చూపించి ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని వెండి తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు అశ్విని కుమార్. నరసింహస్వామి, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడి పురాణకథను ఆధారంగా చేసుకుని హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి యానిమేషన్ సినిమాల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే.

కేవలం కలెక్షన్లే కాకుండా ఇప్పుడీ చిత్రం ఖండాంతరాలు దాటి హాలీవుడ్ యానిమేషన్ చిత్రాలకు గట్టి పోటీగా ఆస్కార్ నామినేషన్‌లో నిలవడం భారతీయ చలన చిత్ర రంగానికే గర్వకారణం. ఈ కేటగిరీలో పాప్ డీమన్ హంటర్స్, డీమన్ ప్లేయర్, ఇన్ఫినిటీ కాస్టెల్ వంటి ప్రముఖ హాలీవుడ్ ప్రాజెక్ట్‌లు ఉండగా వాటితో పోటీలో నిలిచింది.
సినీ ప్రేక్షకులంతా ఇప్పుడు ఒకటే ఆశతో ఉన్నారు. ఈ విజువల్ వండర్ క్రియేషన్‌కు ఆస్కార్ దక్కి, ఇండియన్ యానిమేషన్‌కు కొత్త యుగానికి నాంది పలకాలనే ఆశ. 98వ ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహ చివరి విజేతగా నిలబడుతుందా…? అన్నది చూడాల్సి ఉంది.
