సాధారణంగా సెలబ్రిటీలు ఏదైనా మంచి ఉద్దేశంతో మాట్లాడినా, అది కొన్నిసార్లు రివర్స్ అయ్యి పెద్ద వివాదానికి దారి తీస్తుంది. లేటెస్ట్‌గా నటి నివేదా పేతురాజ్ విషయంలో అదే జరిగింది. చెన్నైలో జరిగిన ఒక స్ట్రీట్ డాగ్స్ ప్రొటెక్షన్ ర్యాలీలో పాల్గొన్న ఆమె, కుక్కల సంరక్షణ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మంటలు రేపుతున్నాయి. కుక్క కాటును పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదంటూ ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
NIVETHA PETHURAJ
నివేదా అసలు ఉద్దేశం ఏంటంటే.. కుక్క కరిచిన ప్రతిసారీ దాన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదని, దానివల్ల ప్రజల్లో అనవసరమైన భయం పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. రేబిస్ ప్రమాదకరమే అయినా, దాన్ని సాకుగా చూపి వీధి కుక్కలను చంపడం సరైన పరిష్కారం కాదని ఆమె వాదించారు. కుక్కలను చంపే బదులు, వాటికి వ్యాక్సిన్లు వేయించడం, జంతు జనన నియంత్రణ (ABC) ఆపరేషన్లు చేయడమే శాశ్వత పరిష్కారమని ఆమె సూచించారు. మన కళ్ల ముందే జంతువులపై హింస జరుగుతున్నా ఎవరూ పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, “కుక్క కాటు పెద్ద విషయం కాదు” అని ఆమె అనడమే ఇప్పుడు సమస్యగా మారింది. సామాన్య జనం, ముఖ్యంగా చిన్న పిల్లలు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు చూస్తున్న నెటిజన్లు నివేదా వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఏసీ కార్లలో తిరిగే వాళ్లకు వీధిలో నడిచే సామాన్యుడి కష్టాలు ఏం తెలుస్తాయని, ఇది చాలా బాధ్యతారహితమైన స్టేట్‌మెంట్ అని విమర్శిస్తున్నారు. దుబాయ్‌లో పెరిగిన ఆమెకు ఇక్కడి గ్రౌండ్ రియాలిటీ తెలియదని కొందరు ఘాటుగా స్పందించారు.
ఈ ట్రోలింగ్, విమర్శలు నివేదా దృష్టికి వెళ్లడంతో ఆమె కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తనను విమర్శించే వాళ్లది మందబుద్ధి అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. మన దేశం నాశనం అవ్వడానికి కారణం వేరే ఏదీ కాదు, బాధ్యత లేని పౌరులే అంటూ ఫైర్ అయ్యారు. సమస్య కుక్కల్లో లేదు, మనుషుల ప్రవర్తనలోనే ఉందని, కుక్కలను రాక్షసులుగా చూడటం ఆపేయాలని ఆమె తన స్టాండ్‌ను సమర్థించుకున్నారు. ప్రస్తుతం ఈ గొడవ భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. జంతు ప్రేమికులు నివేదా మాటకు మద్దతు ఇస్తుంటే, వీధి కుక్కల బాధితులు మాత్రం ఆమె తీరును తప్పుబడుతున్నారు.