గ్రహచారం బాగోకపోతే.. పప్పు తిన్నా పన్ను విరుగుతుంది అన్నట్లుగా తయారయ్యింది పాపం నాగార్జున పరిస్థితి. ఇండస్ట్రీ మొత్తంలో నెగిటివ్ ఇంప్రెషన్ లేని హీరోలుగా వెంకటేష్, నాగార్జున పేర్లు మాత్రమే వినిపిస్తుంటాయి. యువ హీరోలతో మల్టీస్టారర్లు చేయడానికి కూడా ముందుకొస్తూ తనకు కంటెంట్ తో తప్ప స్టార్ డమ్, స్క్రీన్ స్పేస్, ఈగోలతో పనిలేదని పలుమార్లు ప్రూవ్ చేసిన నాగార్జున తన బ్యానర్ అయిన “అన్నపూర్ణ స్టూడియోస్” సంస్థ నుంచి వచ్చే సినిమాలు లేదా తన కుటుంబ సభ్యులు నటించిన సినిమాల ప్రమోషన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తుంటారు. ఆ ఆసక్తి కారణంగా అనవసరంగా ఆయన్ను ఆడిపోసుకొంటున్నారు.
ఇంతకీ విషయం ఏంట్రా అంటే.. గతవారం విడుదలైన “గూఢచారి” మంచి హిట్ సాధించగా ఆ చిత్రంలో సుప్రియా యార్లగడ్డ ఓ ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ.. “మహానటి, రంగస్థలం” తర్వాత ఇండస్ట్రీకి మంచి హిట్ అంటే “గూఢచారి”” అని పేర్కొన్నారు. ఆ రెండు సినిమాల తర్వాత “భరత్ అనే నేను” కూడా వచ్చి మంచి విజయం సాధించింది. నాగార్జున ఆ పేరు చెప్పడం మర్చిపోయారా లేక కమర్షియల్ గా “భరత్ అనే నేను” కొందరికి నష్టాలు మిగిల్చడం తెలిసి అలా అన్నారో తెలియదు కానీ.. ఈ విషయం పుణ్యమా అని ఇప్పుడు మహేష్ అభిమానులు కొందరు నాగార్జునను ట్విట్టర్ లో దాడి చేయడం మొదలెట్టారు.