ఒక్కసారి కమిట్ అయితే చాలు… నా మాట నేనే వినను అంటాడు పండుగాడు అలియాస్ మహేష్‌బాబు ఓ సినిమాలో. నిజ జీవితంలో మహేష్‌బాబు ఇలానే ఉంటారు. మిగిలిన విషయాల్లో ఎంతో మనకు తెలియదు కానీ… ఫిట్‌నెస్ విషయంలో మాత్రం ఈ మాటను పక్కాగా పాటిస్తాడు అని చెబుతుతంటారు. అందుకేనేమో కెరీర్ స్టార్ట్ చేసి ఇన్నేళ్లయినా ఇంకా అదే ఫిట్‌నెస్, లుక్‌తో అదరగొట్టేస్తున్నాడు. ఈ మధ్య తన ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పాడు. ఇప్పుడు ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్‌బాబు ఐదు పదుల వయసుకు దగ్గరవుతున్నా, పాతికేళ్ల కుర్రాడిలా ఫిట్‌గా కనిపిస్తాడు. దానికి కారణం ఆయన బాడీని మెయింటెయిన్ చేసే విధానం. దీంతో చాలామంది ‘మీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో చెప్పండి?’ అని మహేష్ బాబును అడుగుతుంటారు. దీనికి మహేష్ చెప్పే మాట ఒక్కటే. పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆనందంగా ఉండటం. వీటితోనే తాను ఫిట్‌గా ఉండగలుగుతున్నాను అని మహేష్ చెబుతుంటాడు. అయితే తాజాగా అభిమానులకు జిమ్ టిప్స్ కొన్ని చెప్పాడు.
మహేష్‌బాబు (Mahesh Babu) ఈ మధ్య సోషల్ మీడియాలో జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోలు పోస్ట్ చేస్తుంటే… రాజమౌళి సినిమా కోసం అప్పుడే బాడీని ఫిట్‌గా చేసే పనిలో ఉన్నాడు అంటూ కామెంట్స్ వినిపించాయి. దీని గురించి ఇటీవల మాట్లాడుతూ… ‘కసరత్తులు నేను రెగ్యులర్‌గా చేసేవే. కొత్తగా ఏమీ లేదు. అయినా ఆ సినిమాకు ఇంకా చాలా టైమ్ ఉంది’ అని చెప్పాడు. తాజాగా ఆయన ఓ ఫోటో షేర్ చేస్తూ కొన్ని టిప్స్ చెప్పాడు. ఫిట్‌నెస్‌లో ఈ టిప్స్ చాలా అవసరం అని కూడా చెప్పాడు.
కసరత్తుల్లో సూపర్ స్ట్రెచ్ గురించి మహేష్ చెబుతూ… ఈ వర్కవుట్ వల్ల తుంటి, వెన్నెముక, భుజాలు బలంగా తయారవుతాయని చెప్పాడు. అలాగే ఈ ఎక్సర్‌సైజ్ ఓ ఔషధం అని కూడా వివరించాడు. ల్యాండ్‌మైన్ ప్రెస్, కెటెల్‌బెల్ స్వింగ్స్, స్కిల్ మిల్ రన్ లాంటి వర్కవుట్స్ చేస్తూ మహేష్ తన ఫిట్‌నెస్ కాపాడుకుంటాడనే విషయం తెలిసిందే.