పబ్లిసిటీ కోసం గొప్పలు చెప్పుకునే వారు ఒకరకమైతే.. గొప్పగా చేసి పబ్లిసిటీకి దూరంగా ఉండేవారు మరో రకం. రెండో రకానికి చెందినవారే మహేష్ బాబు. తన శ్రీమంతుడు సినిమా అందించిన స్పూర్తితో 2015 లో తెలంగాణలోని సిద్దాపూరును దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనీ సంకల్పించారు. ఒక్కొక్క పనిని పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాను ఫిలిం షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ నమ్రత తో పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ గ్రామాభివృద్ధికి ఇప్పటికే 1.57 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. ఇంకా సిద్దాపూరులో బెంగళూరులోని ఓ పాఠశాల భవనం నమూనా ఆధారంగా అత్యాధునిక పాఠశాల భవనం నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పాఠశాల నిర్మాణానికి మహేష్ 85 లక్షల అందించారు.
ఇదే కాకుండా 8.75 లక్షలతో అంగన్‌వాడీ భవన నిర్మాణం, 1.5 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం, 2.5 లక్షలతో బస్‌షెల్టర్, 1.8 లక్షలతో ఉన్నత పాఠశాలలో రెండు డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటు చేసారు. ఇంకా ఈ గ్రామంలో రహదారులు, మురుగు కాలువలు నిర్మిస్తారు. అన్ని మౌలిక సదుపాయాలన్నీ సమకూర్చడంతో పాటు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం సాక్షరభారత్ కింద ఎల్‌ఈడీ బల్పులు, సబ్బుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ఇలా ఈ గ్రామాభివృద్ధికి దశల వారీగా సుమారు 14 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. ఇన్ని కోట్లతో సిద్ధాపూర్ రూపురేఖలే మారిపోనున్నాయి.