టాలీవుడ్ సూపర్ స్టార్ లో మహేష్ బాబు ఒకరు. అతడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంటాయి. హిట్టు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రతి సినిమాకు మహేష్ బాబు మార్కెట్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇటు యూత్, అటు ఫ్యామిలీస్ ను థియేటర్లకు రప్పించే స్టామినా ఉండటమే దానికి కారణం. ఈ రెండు వర్గాలను అలరించే సినిమా చేశారంటే ఇక బాక్సాఫీస్ మోత మోగిపోవాల్సిందే. ‘సర్కారు వారి పాట’ సినిమా ఆ తరహా సినిమాలనే అనిపిస్తోంది.
రిలీజ్ టైమింగ్ కూడా బాగా కుదరడంతో సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.125 కోట్లు కావడం విశేషం. అన్ని ఏరియాల్లోనూ సినిమాకి మంచి రేట్లు పలికాయి. రెండు తెలుగు రాష్ట్రాల వరకే ఈ సినిమా రూ.100 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ‘సర్కారు వారి పాట’ నైజాం హక్కులు రూ.36 కోట్లు పలకగా.. సీడెడ్ లో ఈ సినిమా హక్కులు రూ.13.5 కోట్లు పలికాయి. వైజాగ్ ఏరియాకు రూ.13 కోట్లకు రైట్స్ తీసుకోగా..
ఆంధ్రలోని మిగతా ప్రాంతాలన్నీ కలిపి హక్కులు రూ.36 కోట్ల మేర పలికాయి. ఇలా మొత్తంగా ఏపీ, తెలంగాణ బిజినెస్ రూ.100 కోట్లకు చేరువగా వెళ్లింది. కర్ణాటక హక్కులు రూ.8.5 కోట్లకు అమ్ముడవగా.. ఓవర్సీస్ రైట్స్ రూ.11 కోట్లకు అమ్మారు. మిగతా ఏరియాల రైట్స్, పబ్లిసిటీ ఖర్చు కలుపుకుంటే ఈ సినిమా రూ.125 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అయినట్లే.
‘ఆచార్య’ సినిమాతో పోలిస్తే ‘సర్కారు వారి పాట’ బిజినెస్ రూ.15 కోట్లు తక్కువ అయింది. ఈ సినిమాకి మంచి బజ్ ఉండడం, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలు. పాజిటివ్ టాక్ గనుక వస్తే.. రూ.125 కోట్ల టార్గెట్ ను అందుకోవడం మహేష్ కి చాలా ఈజీ అనే చెప్పాలి.