చిరంజీవి సినిమా అంటే ఇలానే ఉండాలి అనే థంబ్ రూల్ ఎక్కడైనా ఉందా? మామూలుగా అయితే ఈ మాటకు లేదు అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చిరంజీవి చాలా ప్రయోగాలు చేశారు. వాటితో విజయాలు సాధించింది తక్కువే అని చెప్పాలి. అయితే విజయవంతమైన సినిమాలు చాలా వరకు ప్రయోగాలు లేకుండా.. పక్కా మాస్‌మసాలా కాన్సెప్ట్‌లో రూపొందినవే. తాజాగా మరోసారి చిరంజీవి సినిమా అలాంటి ఆలోచనతోనే రాబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే ఇక్కడ కొత్త సినిమాతో కాదు.. ఆల్‌రెడీ చాలావరకు షూటింగ్ అయిన సినిమాతోనే అని చెబుతున్నాయి.
చిరంజీవిని ఎలా చూపించాలి, ఎప్పుడు ప్రేక్షకులు చిరంజీవికి కనెక్ట్ అవుతారు అనేది ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూసి చెప్పేయొచ్చు అని అంటున్నారు. ఇటీవల కాలంలో విజయాలు వచ్చినా.. సరైన విజయం అంటే మాత్రం ‘వీరయ్య’ తెచ్చిందే అని చెప్పొచ్చు. అంతకుముందు ‘సైరా’, ‘గాడ్‌ఫాదర్’ విజయాలు అందుకున్నా ఆశించినంత మేర జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయాయి. కానీ ‘వాల్తేరు వీరయ్య’ అలా కాదు. జనాలు తండోపతండాలుగా వచ్చారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించిందీ చిత్రం.
ఆ సినిమా విజయం అందుకోవడంతో కామెడీది ప్రధాన పాత్ర అనే విషయం ఎవరినడిగినా చెబుతారు. వింటేజ్ చిరంజీవిని చూపిస్తా అంటూ బాబీ కొల్లి తీసిన సీన్స్‌లో కామెడీ ఒకటి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే ఫార్ములాను ‘భోళా శంకర్’ విషయంలోనూ వాడుకుంటున్నారని టాక్. దర్శకుడు మెహర్ రమేశ్ అతని టీమ్ కలసి కొన్ని కామెడీ సీన్స్ యాడ్ చేశారట. ఒరిజినల్ సినిమా ‘వేదాళం’లో లేని కామెడీ ట్రాక్ ఇందులో ఉంటుందని టాక్. ఇదంతా ‘వాల్తేరు వీరయ్య’ వల్ల వచ్చిన మార్పు అని చెబుతున్నారు.
చిరంజీవిని సీరియస్‌గా, సెంటిమెంటల్ సీన్స్‌లో మాత్రమే చూపిస్తే ప్రేక్షకులు ఇష్టపడటం లేదు అనేది గత సినిమాల అనుభవం. దీంతో ‘భోళా శంకర్’ విషయంలో ఈ మేరకు మార్పులు చేసి సినిమా తీస్తున్నారట. ఈ కారణంగానే సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలాఖరున రావాల్సిన సినిమా వాయిదా వేశారు అని సమాచారం.