ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద క్లాష్ లేకుండా పెద్ద సినిమాలను రిలీజ్ చేయడమనేది నిర్మాతలకు సవాల్ గా మారింది. అయినా కూడా తప్పడం లేదు. కరోనా సమయంలో లాక్ డౌన్ వలన ఇన్నాళ్లుగా ఆగుతూ వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలకు ఏదో ఒక ఆప్షన్ ఎన్నుకోక తప్పడం లేదు. ఈ క్రమంలో సినిమాల రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేయడం, మార్చడం ఇలా జరుగుతూనే ఉంది. తాజాగా అడివి శేష్ ‘మేజర్’ సినిమా కూడా డేట్ మార్చుకుంది.
ముందు అనుకున్న మే 27 కాకుండా వారం వాయిదా తీసుకొని జూన్ 3కి షిఫ్ట్ అయింది. ‘ఎఫ్3’ సినిమా మే 27నే వస్తుండడంతో ఓపెనింగ్స్ పరంగా ఇబ్బంది ఉండదు. అలా అని ‘మేజర్’ సినిమాకి ఎలాంటి ఢోకా లేదని కాదు. జూన్ 3న అంతకుమించి అనేలా పోటీ ఉంది. కమల్ హాసన్ నటిస్తోన్న ‘విక్రమ్’ సినిమా అదే రోజున రానుంది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కాంబినేషన్ తో పాటు ‘మాస్టర్’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ముఖ్యంగా కేరళ, తమిళనాడులో ‘మేజర్’ సినిమాకు ‘విక్రమ్’ నుంచి స్క్రీన్ల పరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్వీరాజ్’ సినిమా సైతం జూన్ 3నే విడుదల కానుంది. ఈ సినిమాపై బాలీవుడ్ జనాల్లో అంచనాలు మాములుగా లేవు. యష్ రాజ్ సంస్థ నిర్మిస్తోన్న పాన్ ఇండియా సినిమా ఇది. కాబట్టి ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదల కావడం ఖాయం. ఈ రెండు పెద్ద సినిమాలను ‘మేజర్’ ఫేస్ చేయడం అంత ఈజీ కాదు.
‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాను సోనీతో భాగస్వామ్యంలో మహేష్ బాబు నిర్మించారు. ఈ సినిమాపై అంచనాలైతే ఉన్నాయి కానీ బాక్సాఫీస్ వద్ద ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి!