తమిళ, మలయాళ, కన్నడ సినిమాలను తెలుగులో (Telugu Language) డబ్బింగ్ రూపంలో విడుదల చేస్తూనే ఉంటారు. ఏడాదికి మన తెలుగు సినిమాలకంటే.. ఈ పరభాషా సినిమాలే ఎక్కువ విడుదలవుతుంటాయి. ఈ పరాయి భాషా సినిమాలను తెలుగులో అందించేది కూడా మన బడా నిర్మాతలే. అయితే.. ఇదివరకు డబ్బింగ్ వెర్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొనేవారు. ఆఖరికి సినిమాల్లో కనిపించే చిన్నపాటి అక్షరాలను కూడా డబ్బింగ్ చేసే భాషకు మార్చేవారు. సీజీ సహాయం కూడా తీసుకొనేవారు.
అలాంటిది ఈమధ్యకాలంలో కొన్ని డబ్బింగ్ సినిమాలను టైటిల్స్ ను కూడా మార్చకుండా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అజిత్ (Ajith ), మోహన్ లాల్ (Mohanlal) సినిమాలను కనీసం టైటిల్ మార్చకుండానే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మొన్నామధ్య రజనీకాంత్ (Rajinikanth) “వెట్టయాన్” (Vettaiyan) సినిమాను అదే పేరుతో మిగతా భాషల్లో విడుదల చేసేసరికి చిన్నపాటి ఇష్యూ కూడా అయ్యింది. అయినప్పటికీ.. తెలుగు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమిళ లేదా మలయాళ సినిమాలను అదే పేరుతో తెలుగులో విడుదల చేసేస్తున్నారు.
రీసెంట్ గా టోవినో థామస్ (Tovino Thomas) “నరివెట్ట” చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు మైత్రీ సంస్థ. “నరివేట్ట” అంటే తోడేలు వేట అని అర్థం. కానీ.. తెలుగులో ఆ టైటిల్ యొక్క అర్థాన్ని సింపుల్ గా ట్యాగ్ లైన్ లా పెట్టేసి, అదే పేరుతో తెలుగులో విడుదల చేయడం అనేది టైమ్ లేకపోవడమా లేక నిర్మాతల బద్ధకమా అనేది తెలియాలి.
ఏదేమైనా తెలుగు మార్కెట్ మీద పెట్టిన శ్రద్ధ, తెలుగు సినిమాను చూసే ప్రేక్షకులకు ఇవ్వకపోవడం అనేది బాధాకరం. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఇకపై ప్రేక్షకులకు నోరు తిరగని పేర్లు థియేటర్లలో వచ్చేస్తాయి, వాటిని ప్రేక్షకులు గుర్తించడం అనేది కాస్త కష్టమే.