Manamey Review in Telugu: మనమే సినిమా రివ్యూ & రేటింగ్!
June 7, 2024 / 01:43 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
శర్వానంద్ (Hero)
కృతిశెట్టి (Heroine)
విక్రమ్ ఆదిత్య , వెన్నెల కిషోర్,రాహుల్ రామకృష్ణ తదితరులు.. (Cast)
శ్రీరామ్ ఆదిత్య (Director)
టి.జి.విశ్వప్రసాద్ (Producer)
హేషమ్ అబ్ధుల్ వహాబ్ (Music)
జ్ణాణశేఖర్ వి.ఎస్ (Cinematography)
Release Date : జూన్ 07, 2024
శర్వానంద్ (Sharwanand) , కృతిశెట్టి (Krithi Shetty) జంటగా.. శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మనమే” (Manamey) . ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ & శర్వానంద్ లుక్స్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఏ మేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: లండన్ కి చదువుకోవడానికి వచ్చి.. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు విక్రమ్ (శర్వానంద్). అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో విక్రమ్ ఓ రెండేళ్ల కుర్రాడికి కేర్ టేకర్ గా వ్యవహరించాల్సి వస్తుంది. అసలు ఆ రెండేళ్ల కుర్రాడు ఎవరు? విక్రమ్ ఆ కుర్రాడి బాధ్యతలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ కథలో సుభద్ర (కృతిశెట్టి) పాత్ర ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానం “మనమే” చిత్రం.
నటీనటుల పనితీరు: “రన్ రాజా రన్” తర్వాత శర్వానంద్ బెస్ట్ లుక్ “మనమే” అని చెప్పాలి. చాలా ఎనర్జిటిక్ గా, యూత్ ఫుల్ గా, కలర్ ఫుల్ గా కనిపించాడు. ఎప్పట్లానే ఎమోషనల్ & కామెడీ సీన్స్ లో చక్కని నటనతో ఆకట్టుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత కనిపించిన కృతిశెట్టి.. మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించింది. శర్వా & కృతీల పెయిర్ తెరపై బాగుంది. వెన్నెల కిషోర్ (Vennela Kishore) , రాహుల్ రామకృష్ణల (Rahul Ramakrishna) పాత్రలు చిన్నవే అయినప్పటికీ.. ఉన్నంతలో చక్కగా నవ్వించారు. చాక్లెట్ బాయ్ రాహుల్ ఈ సినిమాలో విలన్ గా కనిపించడానికి కాస్త కష్టపడ్డాడు.
సాంకేతికవర్గం పనితీరు: జ్ణాణశేఖర్ (Gnana Shekar V. S) సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపించింది. సీజీ వర్క్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. హేషమ్ బాణీలు బాగున్నా.. అన్నీ ఆయనే పాడేయడంతో పాటల్లో వైవిధ్యం కొరవడింది. నేపధ్య సంగీతం బాగుంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ చాలా రిచ్ గా ఉన్నాయి. ముఖ్యంగా లండన్ లొకేషన్స్ & ఇల్లు మంచి రిచ్ ఫీల్ ఇచ్చాయి.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఫిల్మోగ్రఫీ భలే ఎక్సైటింగ్ గా ఉంటుంది. ప్రతి సినిమాతోనూ కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. అన్నీ సినిమాల్లోనూ సెంటిమెంట్ మాత్రం భలే ప్లేస్ చేస్తాడు. ఈ సినిమాలోనూ పిల్లని దూర ప్రాంతాలకు పంపి తల్లిదండ్రులు పడే వేదనను చాలా హృద్యంగా చూపించాడు. ఆ వేదనను పాత్రలు రియలైజ్ అయ్యేలా చేయడానికి పిల్లాడి పాత్రను ఒక కీ టూల్ గా మార్చుకొని తెరపై ప్రొజెక్ట్ చేసిన తీరు బాగుంది.
అయితే.. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. అలాగే, రన్ టైమ్ విషయంలోనూ ఇంకాస్త నిక్కచ్చిగా వ్యవహరించి ఉంటే ఆడియన్స్ ఆ కొద్దిపాటి ల్యాగ్ కూడా ఫీల్ అయ్యేవారు కాదు. హృద్యమైన ఎమోషన్ ను అంతే అందంగా చూపించి దర్శకుడిగా పర్వాలేదు అనిపించుకోగా.. రచయితగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకున్నాడు.
విశ్లేషణ: అసలే థియేటర్లలో సరైన సినిమా లేక దాదాపు రెండు నెలలైంది. అందులోనూ ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాలైతే అసలే లేవు. ఆ లోటు తీర్చే సినిమా “మనమే”. కొద్దిపాటి ల్యాగ్ ను ఇగ్నోర్ చేయగలిగితే.. “మనమే” చిత్రాన్ని కుటుంబంతో కలిసి హుందాగా ఆస్వాదించవచ్చు.