కొన్ని సినిమాలు థియేటర్ల నుండి వెళ్లిపోయిన తర్వాత కూడా చాలా రోజులు గుర్తుండిపోతాయి. కారణం ఆ సినిమాలు మన మీద, సమాజం మీద చూపించే ప్రభావం. రెండో రకం సినిమాల గురించి మనం మాట్లాడక్కర్లేదు కానీ… తొలి రకం సినిమాల గురించి మాత్రం మనం మాట్లాడుకోవాలి. అలాంటి సినిమాల్లో ఒకటి ఇప్పుడు మళ్లీ రాబోతోంది. అంటే మళ్లీ థియేటర్లలోకి వస్తోంది అని కాదు. డిజిటల్ ప్రీమియర్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆ సినిమానే ‘మంగళవారం.’
అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘మంగళవారం’ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించింది. విడుదలకు ముందు నుండే సినిమా మీద పాజిటివ్ బజ్ కనిపించింది. సినిమా పోస్టర్‌లు, జోనర్, టీజర్ ఇలా చాలా సినిమాకు పాజిటివ్ వైబ్స్‌ను తీసుకొచ్చాయి. అనుకున్నట్లుగా సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. హారర్ – థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లు సినిమాను బాగా ఆదరించారు. మరి ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ నెల 26 నుండి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంటుంది.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ ఈ సినిమా (Mangalavaaram) అందుబాటులో ఉండనుంది. ఇక ఈ సినిమాలో నందిత శ్వేత, చైతన్యకృష్ణ, శ్రవణ్ రెడ్డి, రవీంద్ర విజయ్, దివ్య పిళ్లై తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా కథ సంగతి చూస్తే… మహాలక్ష్మీపురంలో వరుసగా రెండు జంటల ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున ఇది జరుగుతుంది. అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంటూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఊరి గోడలపై రాసిన రాతల వల్లే వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని గ్రామస్తులంతా నమ్ముతారు.
ఆ సమయంలోనే ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మాయ (నందిత శ్వేత) అవి ఆత్మహత్యలు కావు, కచ్చితంగా హత్యలే అని బలంగా నమ్ముతుంది. ఆ విషయాన్ని నిరూపించేందుకు ఆ శవాలకు పోస్ట్‌మార్టం చేయించాలని ప్రయత్నిస్తే ఊరి జమిందారు ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ) అడ్డుపడతాడు. అతని మాటకు ఊరు కూడా వంత పాడటంతో మొదటి జంట విషయంలో తన ప్రయత్నాన్ని విరమించుకుంటుంది మాయ.
రెండో జంట చనిపోయినప్పుడు ఊరి వాళ్లను ఎదిరించి మరీ పోస్టుమార్టం చేయిస్తుంది. ఈ క్రమంలో ఊర్లో జరిగినవి ఆత్మహత్యలా? హత్యలా? అనేది తేలుతుంది. ఈ చావుల వెనకున్న లక్ష్యం ఏంటి? వీటికి ఆ ఊరి నుంచి వెలివేసిన శైలజ (పాయల్ రాజ్‌పుత్)కు ఉన్న సంబంధం ఏంటి? ఆమె వెనుక ఉన్న కథేంటి? అనేది సినిమా కథ.